మేడారంలో రూమ్ రెంట్లు వేలల్లో.. ఏసీ రూమ్ రోజుకు 5 వేలు.. నాన్ ఏసీ రూమ్ 4వేలు

మేడారంలో రూమ్ రెంట్లు వేలల్లో.. ఏసీ రూమ్ రోజుకు 5 వేలు.. నాన్ ఏసీ రూమ్ 4వేలు
  • బయట భారీగా వెలసిన గుడారాలు
  • రూ.400 నుంచి వెయ్యి వరకు చార్జ్ 
  • భారీ అద్దెలతో భక్తుల ఇబ్బందులు

ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారంలో రూమ్ రెంట్లు భారీగా వసూలు చేస్తు న్నారు. ఒక్కో రూమ్​ కు  రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా చార్జ్ చేస్తున్నారు. ఏసీ రూమ్​ కు  రోజుకు రూ.5 వేలు, నాన్ ఏసీ రూమ్​ కు  రూ.3 వేల నుంచి రూ.4వేల వరకు తీసుకుంటున్నారు. 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేండ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అమ్మవార్ల సన్నిధిలో బస చేస్తుంటా రు. కొంతమంది భక్తులు బయట బస చేస్తే, మరికొంత మంది రూములు తీసుకుంటారు. ఇలా రూములు తీసుకునే భక్తులను బిల్డింగ్​ ల ఓనర్లు దోచుకుంటున్నా రు. వారి నుంచి అధిక అద్దెలు వసూలు చేస్తున్నారు.

టెంట్ సిటీలో రూ.100

మహా జాతర ఈ నెల 28 నుంచి 31వరకు జరగనుంది. సంక్రాంతి సెలవులతో ఈసారి జాతరకు ముందు నుంచే భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జాతరకు 22 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఇప్పటికే వందలాది గుడారాలు వెలిశాయి. ఒక్కో టెంటుకు కుటుంసభ్యుల సంఖ్యను బట్టి రూ.400 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. హరిత హోటల్ ఎదుట సమ్మక్క సారలమ్మ మేడారం టెంట్ సిటీ పేరుతో ఓ వ్యక్తి గుడారాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఒక్కో వ్యక్తికి రూ.100 మాత్రమే చార్జి చేస్తు న్నట్టు ప్రకటించాడు. భక్తులకు అనువుగా ఉండేలా టెంట్లను ఏర్పాటు చేసి, చుట్టూ షామియానా కట్టారు. ఇక్కడ 200 మంది వరకు బస చేయవచ్చు.

ఫిర్యాదు చేస్తే చర్యలు: కార్యదర్శి

గదులను అద్దెకు ఇచ్చే ఇళ్ల యజమానులు కమర్షియల్ వినియోగానికి సంబంధించి గ్రామ పంచాయతీకి పన్నులు కట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ భారీగా అద్దెలు వసూలు చేస్తున్నోళ్లు పంచాయతీకి పన్నులు కట్టడం లేదు. పక్కా భవనాల్లో గదులు అద్దెకు ఇచ్చేవారికి ఎలాంటి అనుమతులు లేవని, పంచాయతీకి ఎలాంటి రుసుం చెల్లించడం లేదని కార్యదర్శి కొర్నిబెల్లి సతీశ్ తెలిపారు. 

భక్తుల నుంచి భారీగా అద్దె వసూలు చేయొద్దని ఓనర్లకు సూచించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు చొరవ తీసుకుని గదుల అద్దెలను నిర్ణయించాలని, అంత కుమించి ఎవరైనా వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.