భార్య, మామకు నిప్పంటించిన అల్లుడు.. ఆడపిల్ల పుట్టింది.. అదనపు కట్నం ఇవ్వాలని ఘాతుకం !

భార్య, మామకు నిప్పంటించిన అల్లుడు.. ఆడపిల్ల పుట్టింది.. అదనపు కట్నం ఇవ్వాలని ఘాతుకం !
  • సజీవ దహనమైన తండ్రీకూతురు
  • హనుమకొండ జిల్లా కడిపికొండ రాజీవ్‌‌ గృహకల్పలో దారుణం

హనుమకొండ, వెలుగు : ఆడపిల్ల పుట్టినందున అదనపు కట్నం అడిగితే ఇవ్వడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్య, మామను హత్య చేశాడు. తర్వాత వారే డీజిల్‌‌‌‌‌‌‌‌ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కడిపికొండ రాజీవ్‌‌‌‌‌‌‌‌ గృహకల్పలో బుధవారం (మార్చి 18) తెల్లవారుజామున వెలుగు చూసింది. 

స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. కడిపికొండ రాజీవ్‌‌‌‌‌‌‌‌ గృహకల్ప ఐదో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న బాషబోయిన -రాజశేఖర్ (51) ఆటో డ్రైవర్‌‌‌‌‌‌‌‌, కుక్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి రాజశ్రీ (24), తేజస్వి, మనోజ్ఞ కూతుళ్లు. పెద్ద కూతురు రాజశ్రీని వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట (హవేలి)కు చెందిన పొక్కుల ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చి 2023 నవంబర్‌‌‌‌‌‌‌‌లో పెండ్లి చేశాడు. పెండ్లి సమయంలో కట్నం కింద రూ. 3 లక్షలతో పాటు ఇతర పెట్టుపోతలు ఇచ్చాడు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న ప్రవీణ్‌‌‌‌‌‌‌‌, రాజశ్రీ దంపతులకు ఏడాదిన్నర కిందట బాబు జయాన్ష్‌‌‌‌‌‌‌‌ పుట్టగా, ఆరు నెలల కిందట పాప పుట్టింది. దీంతో ఆడపిల్ల పుట్టినందున అదనపు కట్నం తీసుకురావాలని ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ రాజశ్రీని వేధించడం మొదలుపెట్టాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చిన్నారి అన్నప్రాసన కోసం కడిపికొండకు వచ్చిన ప్రవీణ్‌‌‌‌‌‌‌‌, రాజశ్రీ దంపతులు కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నారు. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ అదనపు కట్నం కావాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో అతడి మామ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ ఒప్పుకోలేదు. దీంతో ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ తన భార్య, మామపై కోపం పెంచుకున్నాడు. 

బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ తన భార్య రాజశ్రీతో గొడవ పడ్డాడు. గమనించిన రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ వారి వద్దకు రాగా ఆగ్రహానికి గురైన ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ ఇద్దరిపై సుత్తితో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత కొన ఊపిరితో ఉన్న రాజశేఖర్, రాజశ్రీపై డీజిల్‌‌‌‌‌‌‌‌ పోసి నిప్పంటించాడు. వారు కాలిపోతుండగానే ఎదురింటికి వెళ్లి తండ్రీకూతురు డీజిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మడికొండ సీఐ పుల్యాల కిషన్‌‌‌‌‌‌‌‌ తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తండ్రీకూతురు మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.