
ఇందిరాపార్కు వద్ద టీఎస్పీటీఏ ధర్నా
హైదరాబాద్, వెలుగు : బ్లాక్ చేసిన13 జిల్లాల ఎస్జీటీలతో పాటు భాషా పండితుల స్పౌజ్ బదిలీల ఉత్తర్వులను తక్షణమే జారీ చేయాలని టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ అలీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. స్పౌజ్ బదిలీల కొరకు ఖాళీలు లేవనే నెపంతో 2,300 మంది టీచర్లను బదిలీ చేయకుండా, అప్పీళ్లను 13 నెలలుగా పెండింగ్లో పెట్టారని షౌకత్ అలీ ఆరోపించారు. వీరిలో ఎస్జీటీలను పక్కనపెట్టి, కేవలం 615 మంది స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు చేయడం సరికాదన్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటుహక్కు లేకపోవడంతో పక్కనపెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 65వేల మంది ప్రైమరీ టీచర్ల మద్దతు మీకు అవసరం లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య, భిక్షపతి, బుర్ర నాగరాజు, ఎస్.నరేష్ , గఫూర్, రంగస్వామి, తదితరులు మాట్లాడారు.
జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని ధర్నా
జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థులు మాణిక్ రెడ్డి, భుజంగరావు సంఘీభావం తెలిపారు.