ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె విరమించేదిలేదు

ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె విరమించేదిలేదు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బస్సు డిపోలు, బస్టాండులు, ప్రధాన రహదారులపై కార్మికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను, వివిధ సంఘాల వారిని కలిసి తమకు మద్దతు కోరుతున్నారు. దీనిపై స్పందించిన చాలా ఉద్యోగ సంఘాలు, స్టూడెంట్​ యూనియన్లు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. తమ ఆందోళనల్లో భాగంగా శనివారం హైదరాబాద్​లో బస్​భవన్​ను ముట్టడిస్తామని, డిపోల ఎదుట కుటుంబాలతో కలిసి మౌనదీక్షలు చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె విరమించేది లేదని
స్పష్టం చేశారు.

హైదరాబాద్‌‌, వెలుగు:

ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి మౌనదీక్ష చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాటలు వినే పరిస్థితిలో కార్మికులు లేరన్నారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జేఏసీ నేతలు శుక్రవారం టీజేఎస్​ చీఫ్​ కోదండరాంతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌, కాంగ్రెస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, ఎంపీ రేవంత్‌‌ రెడ్డి, కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే శ్రీధర్‌‌ బాబు, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్​రెడ్డి తదితరులతో భేటీ అయ్యారు. తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం వచ్చాక చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా పోయిందని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులపై పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. తమ సమ్మెకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చావులకు కారణమవుతున్న కేసీఆర్‌‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని కామెంట్​ చేశారు. తమది కార్మికుల పోరాటంగా మొదలై ప్రజా పోరాటంగా మారిందని చెప్పారు.

కార్మికులది న్యాయమైన పోరాటం : రావుల

ఆర్టీసీ కార్మికులది న్యాయమైన పోరాటమని టీడీపీ​ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్  సమస్యను జఠిలం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సమ్మె జీతాల కోసం కాదని, తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన సమ్మె అని చెప్పారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం జరిగే లక్ష్యసాధనలో టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలని డిమాండ్‌‌ చేశారు.

సమ్మె ఆగదు: హనుమంతు

ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆర్టీసీ సమ్మె ఆగదని జేఏసీ వన్‌‌ కన్వీనర్‌‌ హనుమంతు ముదిరాజ్‌‌ స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఆశించామని, కానీ బాధల తెలంగాణగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌‌ సర్కారు తీరు కారణంగా ఇటీవల నలుగురు కార్మికులు చనిపోయారన్నారు. సమ్మెలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ క్రాస్‌‌ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. క్రాస్‌‌ రోడ్డు వద్ద మానవ హారంగా ఏర్పాటయ్యారు. ఈ సందర్భంగా కొంతసేపు ట్రాఫిక్​జామ్​ అయింది. తర్వాత హనుమంతు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌ నియంతృత్వ పోకడలకు పోతున్నారని, ఆయనపై క్రిమినల్​ కేసులు పెట్టాలన్నారు.