దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్

దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు ఎండీ వీసీ సజ్జనార్. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయన్నారు. నిబద్దత, క్రమశిక్షణతో డ్యూటీ చేస్తోన్న వారిపై దౌర్జన్యం చేయడం బాధాకరమన్నారు. కాగా, ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం.. బస్సులు ఆలస్యంగా నడుపుతున్నారంటూ ఆగ్రహంతో ఓ వ్యక్తి డ్రైవర్ పై చేయి చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. 

పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని... వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు సజ్జనార్. ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని మండిపడ్డారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ హెచ్చరించారు.

వికారాబాద్ డిపోలో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న రాములు అనే వ్యక్తిపై నవాజ్ అనే ప్రయాణికుడు దాడి చేశాడు.  బస్సు అలస్యంగా వచ్చిందంని నవాజ్ డ్రైవర్, కండక్టర్ ను ప్రశ్నించగా..  భోజనం చేస్తున్నాం.. ఐదు నిమిషాల్లో బయలు దేరుతామని డ్రైవర్, కండక్టర్ చెప్పారు.

ఈ క్రమంలోనే ఆగ్రహం తెచ్చుకున్న నవాజ్ డ్రైవర్ రాములు పైకి దాడికి దిగాడు. ఘటనపై తోటి వారు కలగజేసుకుని సర్దిచెప్పారు. ఆర్టీసీ అధికారులు ఘటనపై వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగారు డ్రైవర్లు . పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం కేసు నమోదయ్యిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.