మేడారం జాతరకు ఆర్టీసి స్పెషల్ బస్సులు

మేడారం జాతరకు ఆర్టీసి స్పెషల్ బస్సులు

మేడారం జాత‌రకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.  హన్మకొండ బస్టాండ్ నుండి ప్రతి  బుధవారం, ఆదివారం సెలవు దినాల్లో మేడారంకు స్పెషల్ బస్సులు నడపనున్నట్లుగా వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత వెల్లడించారు.  డిసెంబర్ ఈనెల 17 నుండి మేడారంకు  స్పెషల్ బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్లుగా ఆమె తెలిపారు.  

ప్రతి 45 నిమిషాలకో బస్సును ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపాలని నిర్ణయించినట్లు తెలిపారు.  భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని శ్రీలత సూచించారు. 

మరోవైపు జాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.   వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర జరగనుంది.  దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. శుక్రవారం ఈ మేరకు జీవోను విడుదల చేసింది. 

అత్యధికంగా గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.8.28 కోట్లు, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.10.50 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.2.80 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.5.25 కోట్లు, పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు రూ.4.35 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో త్వరలోనే పనులు చేపట్టడానికి ఆఫీసర్లు టెండర్లు పిలవనున్నారు.