ఆంధ్రాకు బస్సులు ఆపేసిన తెలంగాణ ఆర్టీసీ

ఆంధ్రాకు బస్సులు ఆపేసిన తెలంగాణ ఆర్టీసీ
  • అక్కడ మినీ లాక్‌‌డౌన్‌‌‌తో సర్వీసులు నిలిపివేత
  • ఏపీ సరిహద్దు దాకా మాత్రమే కొన్ని బస్సులు
  • అడ్వాన్స్‌‌ బుకింగ్‌‌ డబ్బులు వాపస్
  • ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ కూడా ఆర్టీసీ దారిలోనే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రం నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు బంద్‌‌ అయ్యాయి. ఏపీలో మినీ లాక్‌‌డౌన్‌‌ అమలు కావడంతో బుధవారం నుంచి ఆర్టీసీ అధికారులు బస్ సర్వీసులను నిలిపివేశారు. ఏపీ సరిహద్దుల వరకే కొన్ని బస్సులు నడుపుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌‌ బుకింగ్‌‌ చేసుకున్న ప్యాసింజర్లకు డబ్బులు రీఫండ్‌‌ చేయనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్‌‌ ఈడీ యాదగిరి తెలిపారు. రాష్ట్రం నుంచి ఏపీకి రోజూ 700 వరకు బస్సులు నడుస్తున్నాయి. కరోనా కారణంగా ఏపీలో మినీ లాక్‌‌డౌన్‌‌ ప్రకటించడంతో ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే బయట తిరిగేందుకు అనుమతి ఉంది. తెలంగాణ నుంచి బస్సులు ఇంత తక్కువ సమయంలో వెళ్లి రావడం ఇబ్బంది అవుతున్నందున బస్సులు పూర్తిగా బంద్‌‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

మరింత నష్టాల్లోకి ఆర్టీసీ 
కరోనాతో ఇప్పటికే ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది. ప్రస్తుతం 50 శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. సాధారణంగా రోజుకు రూ.12 కోట్ల నుంచి రూ. 13 కోట్ల దాకా ఆదాయం వస్తుండేది. ఇప్పుడు రూ. 4 కోట్లకు పడిపోయింది. ఏపీకి బస్సులు కూడా బంద్ కావడంతో ఆదాయం మరో రూ. 50 లక్షలు తగ్గనుంది. దీంతో ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ. 3.5 కోట్లకు పడిపోనుంది.  

ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ కూడా..
బుధవారం రాత్రి నుంచి బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ ప్రకటించాయి. ప్రైవేట్ బస్సులు ఎక్కువగా రాత్రి వెళ్తుంటాయి. పైగా ప్యాసింజర్ల నుంచి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో ట్రావెల్స్ బంద్ పెట్టాలని నిర్ణయించారు. అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేట్‌‌ బస్సులు నిలిచిపోవడంతో కొందరు సొంత బండ్లు, కిరాయి వెహికల్స్ లో వెళ్లేందుకు ప్లాన్‌‌ చేసుకుంటున్నారు.