- అనుబంధ సంఘాల గెలుపు కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు
- ఈ నెల 9న ఆర్టీసీలో ఎన్నికలు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నిక కోసం ఈ నెల 9న పోలింగ్ జరగనుండగా.. యూనియన్లు తమ ప్రచార వేగాన్ని పెంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో, బస్ స్టేషన్లలో కార్మిక సంఘాలు పోటాపోటీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. పోలింగ్ కు కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో పోటీలో ఉన్న అన్ని యూనియన్లు తమ అభ్యర్థుల గెలుపుకోసం విస్తృత ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలు డిపోల వారీగా వెళ్లి ప్రచారాన్ని సాగిస్తున్నారు. దశాబ్దం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో ప్రతి యూనియన్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది.
గెలుపు కోసం వ్యూహ రచనలు
యూనియన్ల గెలుపునకు మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వ్యూహ రచనలు చేస్తున్నాయి. తమ అనుబంధ కార్మిక సంఘాలకు చెందిన ఆర్టీసీ యూనియన్లను గెలిపించుకోవడం కోసం రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ వర్కర్స్ యూనియన్ గెలుపు కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా జూమ్ లో సమావేశమై పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ అనుబంధ సంఘాన్ని గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులను కోరారు.
ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కు సీపీఐ మద్దతు ప్రకటించి, ఆ యూనియన్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీపీఐ శాసన సభాపక్ష నేత కూనంనేని సాంబశివ రావు నేరుగా రంగంలోకి దిగారు. ఇక సీపీఎం అనుబంధ కార్మిక సంఘం అయిన సీఐటీయూ మద్దతు ఇస్తున్న ఎస్‌డబ్ల్యూఎఫ్ నల్గొండ, ఖమ్మంలో గెలిచేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. మిగతా చోట్ల ఈ యూనియన్ టీడబ్ల్యూఎఫ్ కు మద్దతు ఇస్తుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదైనా.. అధికార కాంగ్రెస్ కు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో కార్మికులు ఎవరికి మద్దతు ఇస్తారన్నది తేలనుంది.
