కార్పొరేట్ విద్యకు సీఎం ‘బ్రాండ్ అంబాసిడర్’ విచారకరం : ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్

కార్పొరేట్ విద్యకు సీఎం ‘బ్రాండ్ అంబాసిడర్’ విచారకరం : ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్
  •     గ్లోబల్ స్కూల్ ఓపెనింగ్‌‌‌‌లో రేవంత్ వ్యాఖ్యలపై టీఎస్ యూటీఎఫ్ ఫైర్

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ విద్యా వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌లా మారడం విచారకరమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్ విమర్శించారు. ఒక గ్లోబల్ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరై, ప్రభుత్వ స్కూల్స్‌‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యా వ్యవస్థను నాశనం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. 

ఈ మేరకు వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అభ్యసనా సామర్థ్యాలు దాదాపు ఒకేలా ఉన్నాయని అసర్, నాస్  వంటి అంతర్జాతీయ, జాతీయ సర్వేలు చెబుతుంటే.. సీఎం మాత్రం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు అబ్బడం లేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వయంగా విద్యాశాఖను కూడా పర్యవేక్షిస్తున్న సీఎం ఇలా కార్పొరేట్ స్కూళ్ల డబ్బా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే విద్యాశాఖకు 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. మూడో విడత బడ్జెట్‌‌‌‌లోనూ 8.22 శాతానికే పరిమితం చేసిందని గుర్తు చేశారు.