శ్రీవారి ఆస్తుల‌పై టీటీడీ కీల‌క నిర్ణ‌యం: పీఠాధిప‌తుల‌తో క‌మిటీ

శ్రీవారి ఆస్తుల‌పై టీటీడీ కీల‌క నిర్ణ‌యం: పీఠాధిప‌తుల‌తో క‌మిటీ

తిరుమ‌ల శ్రీవారి ఆస్తులపై టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్వామి వారికి భక్తులు ఇచ్చిన భూములు, కానుక‌ల‌ను విక్ర‌యించకూడ‌ద‌ని నిర్ణ‌యించింది. వాటి ప‌రిర‌క్ష‌ణ కోసం పీఠాధిప‌తులు, భ‌క్తుల‌తో క‌మిటీ వేయ‌బోతోంది. గురువారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశ‌మైంది. క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో తొలిసారి టీటీడీ బోర్డు ఇలా ఆన్ లైన్ లో స‌మావేశ‌మైంది. టీటీడీ బోర్డు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిని చైర్మ‌న్ మీడియాకు వెల్ల‌డించారు. నిరుపయోగంగా ఉన్న టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు కమిటీని నియమిస్తున్నామ‌ని చెప్పారు. ఈ క‌మిటీలో పీఠాధిపతులు, భక్తులు సభ్యులుగా ఉంటారన్నారు. అయితే ఇటీవ‌ల తిరుమ‌ల శ్రీవారి ఆస్తులు అమ్మేస్తున్నారంటూ చెల‌రేగిన దుమారంపైనా ఆయ‌న స్పందించారు. భ‌క్తులు కానుక‌గా ఇచ్చిన భూముల‌ను అమ్మాల‌ని గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను త‌మ పాలకమండలిపై రుద్దుతూ బురదజల్లిన వారిపై సమగ్రవిచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశామ‌న్నారు. గ‌తంలో మాదిరిగా శ్రీవారి ఆస్తుల‌ను విక్ర‌యించ‌కుండా ఉండేందుకు ఇవాళ్టి స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వాటి ప‌రిర‌క్ష‌ణ కోసం నూత‌న విధానాన్ని తెచ్చేందుకు క‌మిటీ వేస్తున్నామ‌ని తెలిపారు.

డొనేష‌న్లకు సంబంధించి కొత్త విధానం రూపొందించాల‌ని టీటీడీ ఈవోను కోరుతున్నామ‌న్నారు. ఇక, తిరుమ‌ల‌లో అతిథి గృహాల‌కు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంద‌ని చెప్పారు. పాత అతిథి గృహాలను పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతిస్తామ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే త్వ‌ర‌లో టీటీడీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆసుపత్రిని నిర్మిస్తామ‌న్నారు. శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను తిరిగి అనుమ‌తించ‌డంపైనా చ‌ర్చించామ‌ని, క‌రోనా లాక్ డౌన్ ముగిసిన త‌ర్వాత కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల ప్ర‌కారం శ్రీవారి దర్శనాలపై నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

ttd chairman yv subba reddy gives clarity on ttd assets auction