వారం పాటు టీటీడీ బ్రేక్ దర్శనాలు రద్దు

వారం పాటు టీటీడీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలకు భక్తుల రద్దీ పెరగటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఒక్క రోజు ఎలాంటి టోకెన్లు లేకున్నా తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చింది. అలాగే వారం పాటు బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసింది టీటీడీ. వరుసగా సెలవులు రావటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రేపటి శ్రీవారి దర్శనానికి తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు ఇస్తుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టోకన్ల కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భారీగా బారులు తీరారు. చిన్న పిల్లలు, వృద్దులతో వచ్చిన వారు ఎండలో గంటల తరబడి నిలబడలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

అంతకు ముందు శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ దగ్గర తోపులాట జరిగింది. ఘటనలో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. రెండు రోజుల బ్రేక్ తర్వాత తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ఇచ్చింది టీటీడీ. దీంతో కౌంటర్ల దగ్గర భారీగా రద్దీ పెరిగింది. తొక్కిసలాట ఘటనలో ముగ్గురిని రుయా హాస్పిటల్ కు తరలించారు. 3,4  రోజులవుతున్నా టోకెన్లు ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం, మంచినీటి సదుపాయం  లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.