ఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు

ఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు

తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని  ప్రత్యక్ష ప్రసారం చేయలేదని సాధినేని యామిని టీటీడీపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దీంతో స్పందించిన టీటీడీ విజిలెన్స్ విభాగం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాధినేని యామినిపై ఐపిసి సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశారు.

సాధినేని యామిని 2019 ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కీలకపాత్ర పోషించారు. టీవీ ఛానెళ్ల డిబేట్లలో చురుకుగా పాల్గొని ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. అయితే ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో… ఆమె కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. సోషల్ మీడియా ద్వారా తాజా రాజకీయ పరిణామాలతో హాట్ కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు సాధినేని యామిని. ఆమె కేసు విషయంలో బీజేపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.