టిటిడి పాలక మండలి సమావేశం

టిటిడి పాలక మండలి సమావేశం

తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించారు. తిరుమల నుంచి సమావేశంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అత్యవసర అంశాలపై మాత్రమే చర్చకు వచ్చేలా 55 అంశాలతో కూడిన అజెండాను పాలక మండలి సభ్యులకు టీటీడీ పంపించింది. టేబుల్ అజేండాగా మరిన్ని అంశాలు చేర్చి చర్చించారు.

టిటిడి పాలకమండలి నిర్ణయాలు…

హుండీ ద్వారా ఇప్పటికి రద్దైన నోట్లు వస్తున్నాయి.. ఇప్పటి వరకు 50 కోట్లు పాత నోట్లు ఉన్నయి…. రిజర్వు బ్యాంకుకు అనేక మార్లు లేఖలు రాశాము… మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే బంగారు డిపాజిట్ పై చర్చ జరిగింది. బంగారు డిపాజిట్ లను 12 సంవత్సరాలు లాంగ్ టర్మ్ డిపాజిట్ చెయ్యాలని నిర్ణయానికి వచ్చారు. విజయవాడ, పోరంకిలో కళ్యాణ మండపం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. పాలకమండలి సభ్యుడు పార్థసారథి కోరిక మేరకు కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.

తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలపై చర్చ…

తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాల గురించి చర్చ జరిగింది. వ్యర్ధాలను తరలించడానికి టిటిడి బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి ఆర్థిక విరాళం అందించేందుకు సముఖత తెలిపారు. తిరుమలలో పేరుకు పోయిన 7 టన్నుల వ్యర్థాలు తరలించాల్సి ఉంది. అలాగే యస్వీ అర్ట్స్ కాలేజ్ లో 214 గదుల హాస్టల్ నిర్మాణానికి పాలక మండలి ఓకె చెప్పింది.  ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడతల వారిగా హాస్టల్ నిర్మాణం చేపట్టాలని సూచించింది బోర్డు. టిటిడి ఎలక్రికల్ విభాగంలో పని చేస్తున్న 53 కార్మికుల  కాంట్రాక్టు మరో రెండు సంవత్సరాల పెంపునకు ఆమోదం తెలిపారు. సింగరాయకొండ ఆలయం ప్రాంగణంలో టిటిడి కళ్యాణమండపం నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు.