అన్నదానం విరాళం రూ.5 లక్షలు పెంచిన తిరుమల

అన్నదానం విరాళం రూ.5 లక్షలు పెంచిన తిరుమల

తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి తరలి వచ్చే భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రంలో ప్రసాద వితరణ జరుగుతుంది. శ్రీవారి భక్తుల అన్నప్రసాద వితరణను 33 లక్షల రూపాయిల నుంచి 38 లక్షల రూపాయిలకు పెంచింది.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఒక రోజు అన్నప్రసాద వితరణ కోసం 38 లక్షల రూపాయిలు  విరాళం దాతలు ఇవ్వాల్సి ఉంటుంది. 

తిరుమలలో నిత్యం లక్షలాది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే టీటీడీలో 38 లక్షల రూపాయిల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దాతలు స్వయంగా వడ్డించవచ్చని, దాతల పేర్లను మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సత్రంలో ప్రదర్శిస్తామని టీటీడీ తెలిపింది. 
ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ ప్రకటించింది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని టీటీడీ తెలిపింది.

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోందని తెలిపారు. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో కూడా  అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

ప్రముఖ దినాల్లో 3 లక్షల మందికి పైగా..

తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 3లక్షల మందికి పైగా భక్తులకు టీటీడీ అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8:30 నుంచి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, కూర, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 14 నుంచి 16.5 టన్నుల బియ్యం, 6.5 నుంచి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నట్లు టీటీడీ వివరించింది .