బీఆర్ఎస్ పాలనంతా అవినీతే

బీఆర్ఎస్ పాలనంతా అవినీతే

తెలంగాణ ఏర్పడి 9 ఏండ్లు పూర్తయింది. ఈ 9 ఏండ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అనేది సమీక్షించుకోవాల్సిన సమయమిది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమం సాగింది. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు ఉద్యమంలో ముందుండి కొట్లాడారు. కానీ తెలంగాణ వచ్చినంక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఆరు పదవులు దక్కాయి. ఇక తొమ్మిదేండ్లు గడిచినా రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్టు తయారైంది. ప్రజలు ఆశించిన తెలంగాణ ఇది కాదు. 

ప్రజలను భ్రమల్లో ముంచి, తెలంగాణ సెంటిమెంట్​ను అడ్డంపెట్టుకొని కేసీఆర్ అధికారం సంపాదించారు. ఆంధ్రావాళ్లు తెలంగాణ భూములు కొల్లగొడుతున్నారని, వాళ్లను తరిమికొడితే తప్ప తెలంగాణకు విముక్తి లేదని, ఆంధ్రావాళ్లు దోపిడీదారులని ప్రచారం చేసి ఓట్లు పొందారు. కానీ నేడు తెలంగాణలో జరుగుతున్నదేమిటి? హైదరాబాద్ చుట్టు పక్కల యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతున్నాయి. జీవో 111 ఎత్తివేతపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడానికి స్థలాలు దొరకలేదు గానీ.. కోకాపేటలో బీఆర్ఎస్ కోసం 11 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.500 కోట్ల ఖరీదైన భూమిని, కేవలం రూ.40 కోట్లకే అప్పగించింది. 

డబ్బులతో ఓట్లు కొంటున్నరు.. 

స్థానిక ఎన్నికలు మొదలుకొని  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు ఏవైనా సరే ఇష్టానుసారం డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసే సంస్కృతిని బీఆర్ఎస్ మొదలుపెట్టింది. హుజూరాబాద్ లో ఉప ఎన్నికలో ఓటుకు రూ.10 వేల చొప్పున ఇచ్చి, మద్యం ఏరులై పారించి రూ.500 కోట్లు ఖర్చు పెట్టిందంటే.. ఆ పార్టీ దగ్గర ఎన్ని వేల కోట్ల బ్లాక్ మనీ ఉన్నదోనని దేశమే ఆశ్చర్యపోయింది. దీన్ని దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ప్రజలు చెప్పుకున్నారు. తనను నాయకుడిగా ఎన్నుకుంటే దేశం మొత్తం ఎన్నికల ఖర్చును తానే భరిస్తానని ప్రాంతీయ పార్టీల నాయకులకు కేసీఆర్ చెప్పారంటే.. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చుచేస్తున్నారని అర్థమవుతున్నది. ఇక సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే, ప్రభుత్వం వారికి బకాయిలు విడుదల చేయడం లేదు. బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

ఒక్క హామీ నెరవేర్చలే.. 

కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు. దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు, గిరిజనులకు 12% రిజర్వేషన్ల ఊసెత్తడం లేదు. ప్రభుత్వం 2015లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ప్రారంభించింది. 2,92,057 ఇండ్లను మంజూరు చేసింది. కానీ 9 ఏండ్లు గడిచినా ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 23 వేల ఇండ్లు మాత్రమే ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇన్నేండ్లకు 80 వేల ఉద్యోగాల భర్తీ అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ ప్రశ్నపత్రాల లీకేజీలతో నిర్వహించిన పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని అదీ ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదు. ఫుడ్ పాయిజన్ తో వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. స్కూళ్లకు భవనాలు లేక చెట్ల కింద చదువులు చెబుతున్నారు. వందలాది సంక్షేమ హాస్టళ్లు సొంత భవనాలు లేక అద్దె బిల్డింగుల్లో  నడుపుతున్నారు. వీటిని నిర్మించాల్సిందిపోయి  వాస్తు కోసం ఉన్న సెక్రటేరియట్​ను కూల్చారు. రూ.1,600 కోట్ల ప్రజాధనాన్ని వృథాచేసి రాజభవనం నిర్మించుకొని సీఎం రాచరిక పాలన కొనసాగిస్తున్నారు. పాలనను గాలికొదిలేసి నిరంతరం ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలి? ప్రతిపక్షాలను ఏవిధంగా దెబ్బతీయాలి? అనే దానిపైనే వ్యూహ ప్రతివ్యూహాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రజల సమస్యలపై పూర్తిగా శ్రద్ధ తగ్గిపోయింది. 
– కాసాని జ్ఞానేశ్వర్, టీడీపీ రాష్ట్ర చీఫ్​

5 లక్షల కోట్లకు అప్పులు.. 

2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75,577 కోట్లు అప్పు ఉండగా, ఈ 9 ఏండ్లలో కేసీఆర్ పాలనలో రూ.4.80 లక్షల కోట్లకు అప్పులు చేరాయి. కానీ బీసీ, ఎస్సీ, గిరిజనులు, మైనార్టీలకు బడ్జెట్లో పెట్టే నిధులు ఖర్చు చేయట్లేదు. 9 ఏండ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ కు మొత్తం బడ్జెట్ లో రూ.1.35 లక్షల కోట్లు కేటాయించారు. అందులో ఖర్చు పెట్టింది రూ.79 వేల కోట్లే. గతేడాది దళితబంధు కింద బడ్జెట్ లో రూ.17,700 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చి బీసీలకు రూ.లక్ష ఇస్తామని ప్రభుత్వం మోసపూరిత హామీ ఇచ్చింది.

అన్నింటిలో కమీషన్లు..  

రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి స్కీమ్ లోనూ అవినీతి జరుగుతున్నది. దళితబంధు లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ నాయకులు రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కమీషన్లు కొట్టేసినట్లు సాక్షాత్తు సీఎంకేసీఆరే చెప్పారంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో సైతం బీఆర్ఎస్ నేతలు పేదల దగ్గర కమీషన్లు తీసుకుంటున్నారు. గొర్రెలు, బర్రెలు, చేపపిల్లల కొనుగోలులోనూ అవినీతి జరుగుతున్నది. రైతులకు అందించిన యంత్రలక్ష్మీ స్కీమ్ లోనూ బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల అనుయాయులకు అన్ని స్కీమ్ లలో పెద్దపీట వేస్తున్నారు.