పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : తుమ్మల

పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : తుమ్మల
  • వానకు తడవకుండా చూసుకోవాలి: తుమ్మల 

హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాన్ నేపథ్యంలో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సెక్రటేరియెట్ నుంచి ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చేతికందిన పత్తి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు మంత్రి సూచించారు. తేమ శాతం 12% మించకుండా చూడాలన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతం 20% వరకు ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. 

ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశామని చెప్పారు. రెండు మూడు రోజులు వరి కోతలు ఆపాలని రైతులకు సూచించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 318 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశాం. 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. 28 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. పత్తి క్వింటాల్ రూ.8,110 చొప్పున మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. రైతులు కపాస్ కిసాన్ యాప్‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మకాల్లో ఇబ్బందులు ఉండవు” అని పేర్కొన్నారు.