Turkey Earthquake: 50వేలు దాటిన మృతుల సంఖ్య

Turkey Earthquake: 50వేలు దాటిన మృతుల సంఖ్య

రెండు వారాల క్రితం భారీ భూకంపంతో అతలాకుతలమైన తుర్కియే, సిరియాలో విషాదఛాయలు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రెండు దేశాల్లో కలిసి మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. తుర్కియేలోనే 44వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో ఇప్పటివరకు 5900 మందికి పైగా ప్రాణాలు వదిలినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1.60 లక్షలకు పైగా భవనాలు కూలిపోగా.. వీటిలో 5.20 లక్షల ఇండ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక తుర్కియేలో దాదాపు 15 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడా ఇళ్ల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాని.. ఈ రెండు దేశాల్లో సాధారణ పరిస్థితులు రావడానికి ఏడాదికి పైగా సమయంలో పట్టే అవకాశం ఉంది. 

భూకంపంలో నాసిరకమైనా నిర్మాణాలతోనే ప్రాణనష్టం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇళ్ల పునర్నిర్మాణంలో వేగం కన్నా భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. సుమారు రూ.1.24 లక్షల కోట్ల వ్యయంతో ఇండ్లను నిర్మాణానికి ప్రణాళిక వేశారు. అయితే.. గృహాల పునర్నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2.07 లక్షల కోట్లు ఖర్చవుతుందని అమెరికన్‌ బ్యాంకు ‘జేపీ మోర్గాన్’ అంచనా వేసింది. ఇక5 లక్షల కొత్త ఇళ్లు అవసరమని UNDP వెల్లడించింది.