మైనర్లపై లైంగిక వేధింపులు.. వెయ్యేళ్లు జైలు శిక్ష

మైనర్లపై లైంగిక వేధింపులు.. వెయ్యేళ్లు జైలు శిక్ష

ఇస్తాంబుల్: టర్కీలో ఓ మత బోధకుడికి వెయ్యేళ్ల జైలు శిక్ష వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇస్లామిక్ టెలివిజన్ బోధకుడు, రచయిత అయిన అడ్నాన్ ఓక్తర్ అనే సదరు వ్యక్తిపై క్రిమినల్ గ్యాంగ్‌లను ఏర్పాటు చేయడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలు ఉన్నాయి. ఏ9 పేరుతో ఓ టెలివిజన్ చానల్‌‌ను ఓక్తర్ నడుపుతున్నాడు. ఇస్లామిక్ విలువలు, సంప్రదాయాల మీద అందులో షోలు నిర్వహిస్తుంటాడు. రీసెంట్‌గా ఈ షోలో కొందరు అమ్మాయిలతో కలసి పాటలు కూడా పాడాడు. మైనర్లపై లైంగిక వేధింపులు, మోసం చేయడం, సైనిక రహస్యాలు సేకరించడం వంటి నేరాలకు గాను ఓక్తర్‌కు 1,075 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు అంతర్జాతీయ న్యూస్ సంస్థ డాన్ పేర్కొంది. ఇంకో 13 మందిపై 9,803 సంవత్సరాల జైలు శిక్ష విధించింది టర్కీ కోర్టు. అయితే తనపై అభియోగాలను ఓక్తర్ తోచిపుచ్చడం గమనార్హం. తనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. ఓక్తర్ 300కు పైగా పుస్తకాలు రాయడం విశేషం. ఆ బుక్స్ 73కి పైగా భాషల్లో విడుదలయ్యాయి.