
కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ నారాయణన్ 13,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 53,651 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి వంశా తిలక్ 40,445 ఓట్లతో రెండో స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. అయితే ఆమె యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు.
మొత్తం 15 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గంలో 2,53,707 మంది ఓటర్లు ఉండగా.. 1,30,929 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లలో శ్రీగణేశ్ కు 337, వంశా తిలక్ కు 204, నివేదితకు 241 ఓట్లు వచ్చాయి. నోటాకు 950 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ ఉప ఎన్నికలో గెలుపుతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 65కు పెరిగింది. మరోవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీ ఖాతా ఓపెన్ చేసినట్టయింది. పోయినేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను: శ్రీగణేశ్
ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. మంగళవారం ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీలో మీడియాతో శ్రీగణేశ్ మాట్లాడారు. ‘‘ఇన్ని రోజులు ఒక సాధారణ వ్యక్తిగా ప్రజలకు సేవ చేశాను. ఇప్పుడు వాళ్ల ఆశీర్వదంతోనే ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడు నా బాధ్యత రెట్టింపు అయింది” అని ఆయన అన్నారు. ‘‘గత పాలకుల నిర్లక్ష్యంతో కంటోన్మెంట్ వెనుకబడింది. నియోజకవర్గంలో నీటి సమస్య ఉంది. సరైన స్కూళ్లు, ఆట స్థలాలు లేవు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. కంటోన్మెంట్ విలీనానికి అవసరమైతే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను” అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన: పొన్నం
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
8 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలవడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజల తీర్పును తాము ఎప్పుడూ గౌరవిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.