మెడికల్ కాలేజీల్లో  ఉత్తుత్తి ట్యూటర్లు

మెడికల్ కాలేజీల్లో  ఉత్తుత్తి ట్యూటర్లు

మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాను మభ్యపెట్టేందుకు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. లేసి సిబ్బంది ఉన్నట్టు, అద్దె ఫ్యాకల్టీ, రోజు కూలీలను రోగులుగా చూపిస్తుంటాయి. దాన్ని ‘ఘోస్ట్‌ ఫాకల్టీ’ విధానం అంటారు. ఇప్పుడిదే తీరును గవర్నమెంట్‌ కాలేజీలూ అనుసరిస్తున్నాయి. కాలేజీల్లో సరిపడా సిబ్బంది లేకుంటే ఎంసీఐ సీట్ల కోత విధిస్తుంది. దీన్ని తప్పించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

రాష్ట్రంలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల్లో టీచింగ్‌ ఫ్యాకల్టీ కొరత ఉంది. గతంలో ఎంసీఐ తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో సీట్లకు కోత పడింది. ప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో, సర్కారు కాలేజీల్లోనూ ‘ఘోస్ట్‌ ఫాకల్టీ’ విధానాన్ని అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన సూర్యాపేట, నల్గొండ మెడికల్‌ కాలేజీల్లో ఎంసీఐ బృందం సోమవారం పర్యటించింది. అక్కడ ఎంబీబీఎస్‌ తరగతుల నిర్వహణకు వసతులున్నాయా, స్టాఫ్‌ ఉన్నారా వంటి అంశాలపై ఎంసీఐ ప్రతినిధులు ఆరా తీశారు. గతేడాది ఇలాగే తనిఖీలు చేసిన ఎంసీఐ.. వసతుల్లేవని తరగతులకు అనుమతివ్వలేదు. అయినా ప్రభుత్వం మేలుకోలేదు. ఇప్పటికీ సూర్యాపేట కాలేజీలో సరిపడా స్టాఫ్‌ను నియమించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం తనిఖీలకు వచ్చిన ఎంసీఐ బృందానికి దొరక్కుండా సమీప పీహెచ్‌సీల్లోని డాక్టర్లను సూర్యాపేట కాలేజీ సిబ్బందిగా చూపినట్టు తెలిసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్​ పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో పనిచేస్తున్న సుమారు 20 మంది డాక్టర్లను ట్యూటర్లుగా చూపినట్టు సమాచారం.