హైదరాబాద్: తెలుగు యాంకర్ విష్ణుప్రియకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలిగా మారారు. తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వివరాలను విష్ణుప్రియ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా బుల్లి తెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన విష్ణుప్రియ.. కొన్ని టీవీ షోల్లో యాంకర్గా కూడా చేశారు.
Also Read : కంగనాకు సీక్రెట్‌గా పెళ్లైందా?
అయితే.. ఆమె ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణు ప్రియపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆమెను ఈ కేసులో విచారించిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రాం సబ్స్క్రిప్షన్ పేరుతో విష్ణుప్రియ అశ్లీల కంటెంట్ను పోస్ట్ చేసి యువతను పెడ దోవ పట్టిస్తుందని ఆమెపై ఇటీవల ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు సూర్యారావుపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
