చెన్నై: ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమిళనాడులో నడిచిన హైడ్రామాకు తెర పడింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ మే 8న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం ఇందుకు వేదిక కానుంది.
#WATCH | Tamil Nadu: TVK chief Vijay meets Governor Rajendra Vishwanath Arlekar and stakes claim to form Government in the state.
— ANI (@ANI) May 8, 2026
(Video Source: Tamil Nadu Lok Bhavan) pic.twitter.com/SleWYzzvZm
టీవీకే అధినేత విజయ్ తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల సంతకాలతో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను (118) విజయ్ చేరుకున్నారు.
టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. ఇలా మొత్తం కలిపి..118 మంది ఎమ్మెల్యేల బలంతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తమిళనాడు గవర్నర్ అర్లేకర్ను విజయ్ మూడోసారి కలిశారు. అయితే.. ఈ మూడోసారి విజయ్ తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతుతో కలవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను108 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో అధికార డీఎంకే పార్టీ 60 స్థానాలకు, ప్రతిపక్ష అన్నాడీఎంకే 47 సీట్లకు పరిమితమయ్యాయి. భారత రాజకీయ యవనికపై ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళ సినీ దిగ్గజం విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఎన్నికల బరిలో దిగిన తొలిసారే అద్భుతమైన ఫలితాలను సాధించి, అందరి దృష్టిని ఆకర్షించింది.
దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేలాంటి బలమైన పార్టీలను వెనక్కి నెట్టి, టీవీకే విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక కొత్త పార్టీ తన తొలి ప్రయత్నంలోనే ఇలాంటి భారీ ఆధిక్యాన్ని సాధించడం భారత రాజకీయ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
