దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. 2026 మార్చి నెల వాహన్ పోర్టల్ లెక్కలు చూస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో దిగ్గజ పాత కంపెనీలు తమ ఆధిపత్యాన్ని చాటుకోగా.. ఒకప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల పరంగా 5వ స్థానానికి పడిపోవడం గమనార్హం. మార్చి నెలలో మొత్తం లక్షా 39వేల238 ఈవీ స్కూటర్లు రిజిస్టర్ అయ్యాయి.
దూసుకుపోతున్న టీవీఎస్ మోటార్..
ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో టీవీఎస్ మోటార్ తన నంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తోంది. మార్చి నెలలో ఈ కంపెనీ 38వేల 007 యూనిట్లను విక్రయించి 27.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌కు మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లోనూ డిమాండ్ పెరగడం, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్ ఈ విజయానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బజాజ్ ఆటో 33వేల 447 యూనిట్ల అమ్మకాలతో 2వ స్థానంలో నిలిచి గట్టి పోటీనిస్తోంది.
వెనుకబడ్డ ఓలా..
బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ 26వేల151 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. తన 450 సిరీస్‌తో పాటు కొత్తగా వచ్చిన రిజ్తా ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ పుంజుకోవడానికి తోడ్పడింది. హీరో మోటోకార్ప్‌కు చెందిన 'విడా' బ్రాండ్ 15వేల 683 యూనిట్లతో 4వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే గతంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మార్చి నెలలో జస్ట్ 6వేల 381 యూనిట్ల రిజిస్ట్రేషన్లతో 4.6 శాతం వాటాకు పరిమితమై ఐదో స్థానానికి పడిపోయింది. పాత కంపెనీలు తమ ఈవీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంతో పాటు సర్వీస్ ఇష్యూస్ ఓలాను వెనుకకు నెట్టాయి.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'పీఎం ఈ-డ్రైవ్' సబ్సిడీ గడువు మార్చి 31, 2026తో ముగియనుండటంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు ఆర్థిక సంవత్సర ముగింపు కావడంతో కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఎక్స్ మోడల్‌ను రూ.49వేల 999 ప్రారంభ ధరకే అందించగా, ఏథర్ ఎనర్జీ రూ.20వేల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. సబ్సిడీ ముగిస్తే ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో కస్టమర్లు మార్చి నెలలోనే కొనుగోళ్లు పూర్తి చేశారు.
సో తాజా అమ్మకాల డేటాను పరిశీలిస్తే ఈవీ మార్కెట్‌లో కస్టమర్లు ఇప్పుడు నమ్మకమైన సర్వీస్, బలమైన నెట్‌వర్క్ ఉన్న పాత కంపెనీల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోందని ఆటో నిపుణులు అంటున్నారు. ఫీచర్స్ కంటే సర్వీస్ ముఖ్యం అని అంటున్నారు కొనుగోలుదారులు కూడా.
