ప్రైవేటు వాళ్లకిస్తే తప్పేంది?

ప్రైవేటు వాళ్లకిస్తే తప్పేంది?

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం ఎప్పటిది? ఎందుకు మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? ప్రైవేటీకరణను మోడీ ప్రభుత్వం మాత్రమే చేసిందా? దీని వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి లాభమా.. నష్టమా? అనే విషయాలను లోతుగా పరిశీలిస్తే మనకు వాస్తవాలు తెలుస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధాలని 1980 చివరి నాళ్లలోనే ప్రముఖ ఆర్థికవేత్తలు గుర్తించారు. వాటిలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు ఉపసంహరించాలని, పూర్తిగా లేదా కొంత మొత్తం వాటాలను ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా పేరుగాంచిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ప్రైవేటీకరణకు పునాది పడింది. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల్లో ప్రైవేటీకరణ కూడా ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను తగ్గించడం, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడం ఇందులో  ముఖ్యసూత్రం. పీవీ సూచించిన పెట్టుబడుల ఉపసంహరణ దిశగా మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు 1996లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ కింద ఓ కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, వాటి ప్రైవేటీకరణకు అనుసరించాల్సిన సూత్రాలను ఈ కమిషన్‌‌‌‌ ప్రభుత్వానికి అందించాలి. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి మార్గం సుగమం అవుతుంది. 2001లో ఏర్పడిన వాజ్‌‌‌‌పేయి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆర్థిక నిపుణుడు మన్మోహన్‌‌‌‌సింగ్ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఆర్థిక శాఖలో స్వతంత్ర విభాగంగా విలీనం చేసింది. 2016లో డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్(DIPAM)గా దీని పేరు మార్చారు. కేంద్రం అధీనంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ DIPAM లక్ష్యం.

ఎన్నో సంస్థలను ప్రైవేటుకు అప్పగించారు
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించింది పీవీ అయినా మొదట అమలు చేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే. 2001 నుంచి 2004 మధ్య భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, సీఎంసీ లిమిటెడ్, హిందుస్థాన్ జింక్, హోటల్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, ఐబీపీ, ఇండియన్ టూరిజం డెవలప్‌‌‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌, ఇండియన్ పెట్రో కెమికల్స్, జెస్సోప్, లగాన్ జూట్ మెషినరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను ప్రైవేటుకు అప్పగించారు. ఆ తర్వాత మన్మోహన్ ప్రధానిగా ఉన్న యూపీఏ హయాంలో 2004-–-14 మధ్య ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌పీసీ, ఎన్టీపీసీ, ఆర్‌‌ఈసీ, ఎన్‌‌‌‌ఎండీసీ, ఎస్‌‌‌‌జేవీఎన్‌‌‌‌ఎల్‌‌‌‌, ఈఐఎల్‌‌‌‌, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మాంగనీస్ ఓర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , ఓఎన్‌‌‌‌జీసీ, సెయిల్‌‌‌‌, నాల్కో, ఆర్‌‌‌‌సీఎఫ్‌‌‌‌, హిందుస్తాన్ కాపర్, ఎన్‌‌‌‌బీసీసీ, బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌, ఎంఎంటీసీ, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఇలా 33 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను అమ్మేశారు. వాజ్‌‌‌‌పేయి, మన్మోహన్ ప్రభుత్వాలు అమ్మేసిన ప్రభుత్వ రంగ సంస్థల మూలంగా ఔషధాలు, ఇంధనాలు, అల్యూమినియం, గడియారాలు, హైడ్రోజన్, కెమికల్స్, థర్మల్ విద్యుత్ లాంటివి దొరకకుండా ఉండాలి. కానీ అలా జరగలేదు. పైగా నాణ్యత ఆధారంగా వివిధ కేటగిరీల్లో ఆ ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి. 20 ఏండ్ల క్రితమే మూతపడ్డ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్(ఐడీపీఎల్) కారణంగా సామాన్యులకు మందులు దొరకకుండా ఆగిపోలేదే. పైగా ప్రపంచానికి కరోనా వైరస్ వాక్సిన్‌‌‌‌ను అందించగలిగే ప్రైవేట్ సంస్థలు వచ్చి మన దేశాన్ని మేటి శక్తిగా నిలిపాయి.
ప్రైవేట్‌‌‌‌కు అప్పగిస్తే ప్రభుత్వానికి రెట్టింపు ఆదాయం
ఒక ప్రభుత్వ రంగ సంస్థలోని వంద శాతం ప్రభుత్వ వాటాలను ప్రైవేటీకరణ చేస్తే.. దానిని అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ముతోపాటు ఆ సంస్థ ద్వారా ఏటా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రెట్టింపు ఆదాయం లభిస్తుంది. తద్వారా ప్రభుత్వానికి రిస్క్ లేకుండా పన్నుల రూపంలో లభించే ఆదాయం పెరుగుతుంది. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వాన్ని నడపాల్సిన గత్యంతరం తప్పుతుంది. ప్రజలపై పన్నుల మోత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, పరిపాలన విషయాల్లో నాణ్యతను పెంచగలిగే అవకాశాలు ప్రభుత్వానికి లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థ నష్టపోతే ఆ నష్టాన్ని ప్రజలు చెల్లించే పన్నులతో పూడ్చాల్సిన పరిస్థితి పోతుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అన్ని రంగాల్లో ప్రోత్సాహించలేం. విద్య, వైద్యం లాంటి ముఖ్యమైన రంగాల్లో ప్రైవేట్ శక్తులు ప్రవేశించడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు అందాల్సిన విద్య, వైద్య హక్కులను కాలరాసినట్టే అవుతుంది. కానీ, దేశంలో ఇప్పటికే ముఖ్యమైన ఈ రంగాల్లో ప్రైవేటు సంస్థలు ప్రవేశించాయి. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సింది పోయి.. మిగతా రంగాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు తెరతీస్తుండడం సరి కాదు.
8 శాతం మంది కో3సం ఉద్యమాలా?
దేశ జనాభాలో ప్రభుత్వరంగ సంస్థలపై నేరుగా ఆధారపడి జీవించే ప్రజలు (ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డీలర్లు మొదలైనవారు) 8 శాతం ఉంటే.. ప్రభుత్వంపై, ప్రభుత్వరంగ సంస్థలపై నేరుగా ఆధారపడకుండా స్వశక్తితో జీవించేవారు(కాయకష్టం చేసి బతికేవారు, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ నిపుణులు, వ్యాపారస్తులు మొదలైనవారు) 92 శాతం ఉన్నారు. 8 శాతం మంది ఆధారపడిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే దాని వల్ల దేశానికి ఏదో ఉపద్రవం వస్తుందనే అపోహను కొన్ని రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నాయి. దీని వల్ల పరోక్షంగా తమ పన్నులపై ఆధారపడి జీవించే 8 శాతం మంది కోసం స్వశక్తితో బతికే మిగతా 92 శాతం మంది ఉద్యమించాల్సిన, వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తోంది.

మన్మోహన్ చేస్తే మంచి.. మోడీ చేస్తే చెడా?
యూపీఏ హయాంలో ఏకంగా 33 ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను అమ్మేశారు. ఈ విషయంపై అప్పట్లో కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు ఎలాంటి ఉద్యమాలూ చేసిన దాఖలాలు లేవు. మన్మోహన్ తరహాలోనే మోడీ కూడా ముందుకు వెళ్తుంటే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు అడ్డుకుంటున్నాయి. ఉద్యమాలు చేస్తున్నాయి. ఇందుకు కారణాలు పరిశీలిస్తే.. ప్రైవేటీకరణ నిర్ణయం మూలంగా దేశానికి, ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రైవేటీకరణలో అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యత లభిస్తోంది. రెండు లక్షల కోట్ల విలువ కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఆస్తుల అమ్మకానికి సంబంధించి రూ.30 వేల కోట్లకు మాత్రమే వాల్యుయేషన్ చేసినట్టుగా వస్తున్న విమర్శలకు జవాబు ఇవ్వడం లేదు. వీటన్నింటికీ కేంద్రం నుంచి సరైన జవాబు రాకపోవడంతో సహజంగానే ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా ఇటు కేంద్రం, అటు ప్రధాని మోడీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో ఎలాంటి విధానాలను ఆచరించబోతున్నారు? జాతి సంపదగా భావించే సంస్థల అమ్మకం ద్వారా దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ప్రజలకు కేంద్రం స్పష్టంగా తెలియజేయాలి. ప్రతిపక్షాల గగ్గోలుకు సరైన జవాబు ఇవ్వాలి. అప్పుడే అనుమానాలు తొలగిపోతాయి.


ప్రజల పన్నులతో నష్టాలు పూడుస్తున్నరు
ప్రభుత్వంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం ఏర్పడినవే ప్రభుత్వ రంగ సంస్థలని విశ్లేషకులు చెబుతుంటారు. ప్రభుత్వ రంగం అన్నప్పుడే అవినీతికి పునాది పడుతోంది. చైర్మన్, డీలర్, కాంట్రాక్టర్‌‌‌‌, కమిషన్ అన్నీ మన అనుకున్నవాడికే ఇవ్వాలని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. తమ కేడర్‌‌‌‌లో ఉన్న ముఖ్య నాయకులకు ముఖ్య పదవులు, కాంట్రాక్టులు, కమిషన్లు కట్టబెట్టి.. వారి నుంచి నజరానాలు పొందే సౌలభ్యం ఉంటుంది. నజరానాలు ఇచ్చి పదవులు, కాంట్రాక్టులు, డీలర్‌‌‌‌షిప్‌‌‌‌లు పొందిన నాయకులు, వ్యక్తులు నిజాయతీగా పనిచేస్తారా? ఇక్కడి నుంచే ప్రభుత్వ రంగ సంస్థల పేలవ ఫలితాలకు పునాది పడుతోంది. ఫలితంగా ప్రైవేట్ సంస్థలతో పోటీపడలేక నష్టాల బాట పడుతున్నాయి. చివరికి ఆ నష్టాల భారాన్ని తిరిగి ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల డబ్బుతోనే ఈ నష్టాలను పూడ్చాల్సి వస్తోంది. ఎవరు అవునన్నా.. కాదన్నా దేశంలో జరిగేది ఇదే. మొదట్లో అంతా లాభాల్లో ఉన్నట్టే కనిపించినా రానురాను నష్టాల బాట పట్టడం ప్రఖ్యాత ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డ తీరును చూస్తే అర్థమైపోతుంది. హెచ్ఎంటీ, ఆల్విన్, ఐడీపీఎల్ లాంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు మొదట్లో ఉన్నంత ప్రభావవంతంగా ఆ తర్వాత ఉండకపోవడం వల్లే తమ ప్రతిష్టను దిగజార్చుకుంటూ చివరికి నష్టాలతో మూతపడ్డాయి.                                                     - శ్రీనివాస్ గుండోజు, సీనియర్ జరన్లిస్ట్