
- ఒక్క నిజామాబాద్‌లోనే 125 మంది బాధితులు
నిజామాబాద్, వెలుగు : ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి కోట్లు కొల్లగొట్టారు. క్రిప్టో కరెన్సీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ వంటి పేర్లతో పలువురి నుంచి రూ. 15 కోట్లు సేకరించారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా... కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించారు. ఓ టీచర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిజామాబాద్ జిల్లా పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ నగరానికి చెందిన మహ్మద్ మెయిస్ ఖాన్, సయ్యద్ అహ్మద్ హసన్ చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్.
కలిసి చదువుకున్న వీరిద్దరి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో అక్రమాలకు తెర లేపారు. అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి పలువురి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు సేకరించారు. అలాగే శ్రీమ్ ఎవర్ గ్రీన్ కన్స్‌స్ట్రక్షన్స్, మోవన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతో కంపెనీలను సృష్టించి రియల్ ఎస్టేట్ రంగంలో, Profitreehub.com, Scotraprofit.com పేరుతో ఆన్‌లైన్ సైట్స్ సృష్టించి పెట్టుబడులు సేకరించారు. కమీషన్ ఏజెంట్లను నియమించుకొని డిపాజిట్లు సేకరించడంతో పాటు మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ముంబాయి, గుల్బర్గాలో రీజినల్ ఆఫీస్‌లు ఓపెన్ చేశారు.
ఆలేరులో హైడ్రామూవ్ కంపెనీ పేరుతో ఆఫీస్‌ను ఓపెన్ చేశారు. సైబర్ నేరస్తులతో కలిసి డాలర్ ట్రేడింగ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఇలా 2022 నుంచి వందలాది మంది వద్ద రూ. 15 కోట్లు సేకరించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 125 మంది రూ. 8 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు చూపుతూ డబ్బు మొత్తాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన హకీం అనే టీచర్ వీరి వద్ద పెట్టుబడి పెట్టడంతో పాటు ఏజెంట్‌గా పనిచేసి మరికొందరితో ఇన్వెస్ట్ చేయించాడు.
కానీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పెట్టుబడి పెట్టిన వారంతా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో హకీం పది రోజుల కింద ఇందల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీపీ సాయిచైతన్య విచారణ బాధ్యతను సీసీఎస్ టీమ్‌కు అప్పగించారు. దీంతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు మహ్మద్ మెయిస్ ఖాన్, సయ్యద్ అహ్మద్ హసన్‌ను నిజామాబాద్‌లో అరెస్ట్ చేశారు. నిందితులిద్దరీ బ్యాంక్ అకౌంట్స్, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని సీసీఎస్ ఏసీపీ తెలిపారు. వీరికి వాజిద్ హుస్సేన్ అనే మరో వ్యక్తి సహకరించాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని, ఈ అక్రమంలో ఇంకా ఎంత మంది ఉన్నారో విచారిస్తామని చెప్పారు.