
శంషాబాద్, వెలుగు: ఒరిజినల్ ఏటీఎం కార్డు తీసుకొని డూప్లికేట్ కార్డులు ఇచ్చి మోసగిస్తున్న ముఠాను మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్నరసింహ తెలిపిన ప్రకారం.. కర్ణాటకకు చెందిన శంకర్ పవార్, మధ్య ప్రదేశ్ కు చెందిన అజయ్ సాహు, విపిన్ కుమార్ సాహు కొంతకాలం కిందట సిటీకి వచ్చి కాటేదాన్ టీఎన్ జీవోఎస్ కాలనీలో ఉంటున్నారు. వీరు ఏటీఎంల వద్దకు వచ్చే జనాల నుంచి ఒరిజినల్ ఏటీఎం కార్డు తీసుకుని డూప్లికేట్ కార్డులను ఇచ్చేవారు. అనంతరం పిన్ నంబర్తెలుసుకొని లక్షా 6 వేల నగదు తస్కరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి కాటేదాన్ స్వప్న థియేటర్ వద్ద గురువారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా అజయ్ సాహు, విపిన్ కుమార్ సాహులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శంకర్ పవార్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద 9 ఎస్బీఐ,6 యూనియన్ బ్యాంక్,2 కెనరా బ్యాంక్,2 ఐసీఐసీఐ, 2 హెచ్ డీఎఫ్సీ,2 బ్యాంక్ ఆఫ్ బరోడా,6 ఇతర ఏటీఎం కార్డులతో పాటు 10 వేల క్యాష్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.