ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసి చలామణీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసి చలామణీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 

సికింద్రాబాద్​, వెలుగు: ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసి చలామణీ చేస్తున్న ఇద్దరిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు.  మంగళవారం సికింద్రాబాద్ లోని నార్త్​జోన్​ డీసీపీ ఆఫీసులో  డీసీసీ చందనా దీప్తీ  వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణేకు చెందిన కస్తూరి రమేశ్​బాబు(35) కుటుంబం గతంలోనే ఉపాధి కోసం సిటీకి వచ్చి బండ్లగూడ జాగీర్​ లోని ఇందిరా నగర్​కాలనీలో ఉంటోంది.  రమేశ్​బాబు కాళీమందిర్ ఏరియాలో కారు మెకానిక్ షెడ్డును నడుపుతున్నాడు. జల్సాలకు బానిసై ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసేందుకు స్కెచ్ వేశాడు. తన సోదరి రామేశ్వరికి ఈ విషయం చెప్పాడు. ఇద్దరు కలిసి యూట్యూబ్ లో ఫేక్ కరెన్సీని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు. అందుకు కావాల్సిన సామగ్రిని కొన్నారు. ఫేక్ నోట్లను చలామణీ చేస్తూ.. ఆర్థికంగా సాయం కావాలంటే తమను సంప్రదించాలని వీడియోలు చేసి యూట్యూబ్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలను చూసిన నాచారంలోని ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సట్ల అంజయ్య(38 ) రమేశ్​ బాబును కాంటాక్ట్ అయ్యాడు.  తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని అతడితో చెప్పాడు.

తమ వద్ద ఫేక్ కరెన్సీ ఉందని, రూ.50 వేల ఒరిజినల్ నోట్లకు రూ. లక్షా 30 వేల ఫేక్ నోట్లను ఇస్తామని అంజయ్యతో రమేశ్​ బాబు చెప్పాడు. ఇందుకు ఒప్పుకున్న అంజయ్య రూ.50 వేలను రమేశ్ బాబుకు ఇచ్చాడు. ఫేక్ నోట్లను తీసుకున్న అంజయ్య ఈ నెల 19న సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ఎదురుగా ఉన్న  పండ్ల వ్యాపారి  గోపిరామస్వామి దగ్గర వాటిని చలామణీ చేశాడు. అది ఫేక్ కరెన్సీగా గుర్తించిన రామస్వామి అంజయ్యను వెంబడించి పట్టుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. అంజయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో మంగళవారం రమేశ్​ బాబును అదుపులోకి తీసుకున్నారు. రూ.2.50 లక్షలకు పైగా ఫేక్ కరెన్సీ, ప్రింటర్, కారు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితురాలు రామేశ్వరి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు.