గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని నార్త్​జోన్ పోలీసులు వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. వారి నుంచి 19.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నార్త్​జోన్ డీసీపీ ఆఫీసులో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. చింతల్ బస్తీకి చెందిన విలాస్​రెడ్డి(32) ఏపీ పాడేరులోని విద్యాశాఖ ఆఫీసులో ఔట్​సోర్సింగ్​ఎంప్లాయ్ గా చేస్తున్నాడు. అదే ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న వారి వద్ద కొని ట్రైన్​లో సిటీకి తరలిస్తున్నాడు. ఇక్కడ అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్​ నిలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విలాస్ ను తుకారాంగేట్ పోలీసులు తనిఖీ చేయగా15.6 కిలోల గంజాయి దొరికింది. అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని, పాడేరులో గంజాయిని పండిస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు.

మరో కేసులో..

వరంగల్ కాశిబుగ్గకు చెందిన షేక్ ఇమ్రాన్​(29) వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో పంక్చర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదాయం సరిపోవడం లేదని అదే ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నవారి వద్ద కొని హైదరాబాద్​లో అధిక ధరకు అమ్ముతున్నాడు. మంగళవారం ఇమ్రాన్ రెండు ప్యాకెట్లలో 3.7కిలోల గంజాయి తెచ్చి సికింద్రాబాద్​రైల్వేస్టేషన్ సమీపంలో నిలబడ్డాడు. కొనేందుకు ఎవరూ రాకపోవడంతో తర్వాత సెయింట్ మేరీ స్కూల్ వద్దకు వచ్చాడు. అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఇమ్రాన్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా 3.7 కిలోల గంజాయి దొరికింది. విచారణలో వరంగల్​చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయి పండిస్తున్నట్లు, దాన్ని రైళ్లలో స్మగ్లింగ్​చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ఇమ్రాన్​ను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.