జగిత్యాల జిల్లాలో మూడు రోజుల్లో రెండు సూసైడ్​ అటెంప్ట్‌లు

జగిత్యాల జిల్లాలో మూడు రోజుల్లో రెండు సూసైడ్​ అటెంప్ట్‌లు
  • సోషల్ మీడియాలో యువకుడి సెల్ఫీ వీడియో  
  • జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన 

మల్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మల్యాల ఎస్ఐ చిరంజీవి తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడు బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు నక్క అనిల్​కథనం ప్రకారం.. అనిల్ ​భూమి పంచాయతీ తేలుస్తానని ఎస్ఐ చిరంజీవి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడు. ఇంకా ఎక్కువ పైసలు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేసి కొట్టాడు. మరోసారి డబ్బులడిగితే పీడీ యాక్ట్ పెడతామని బెదిరించాడు. దీంతో పురుగుల మందు తాగినట్టు అనిల్​ వీడియోలో చెప్పాడు. దీన్ని సోషల్ ​మీడియాలో పెట్టడంతో పోలీసులు, కుటుంబసభ్యులు అనిల్ ​కోసం గాలించారు. చివరకు ఫోన్ సిగ్నల్ ఆధారంగా సర్వాపూర్ శివారులో గుర్తించి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. 

మూడు రోజుల్లో రెండు ఘటనలు 

మల్యాల పోలీసుల తీరుకు నిరసనగా మండలంలో రెండు రోజుల్లోనే రెండు ఆత్మహత్యాప్రయత్నాలు జరిగాయి. ఈ నెల 21న పీఎస్​సమీపంలో పోలీసుల తీరుకు నిరసనగా రవీందర్​రెడ్డి సూసైడ్​అటెంప్ట్​చేయగా, బుధవారం అనిల్ ఆత్మహత్యాయత్నం చేయడం చర్చకు దారితీసింది.  ఈ ఘటనపై  ఎస్ఐ చిరంజీవి స్పందిస్తూ అనిల్​కు నేరచరిత్ర ఉన్నదని, ఇప్పటికే ఆయనపై ఎనిమిది కేసులు నమోదయ్యాయని చెప్పారు. అవన్నీ కొట్టివేయడంతో పాటు రౌడీషీట్​ఎత్తేయాలని బెదిరిస్తూ తనపై ఆరోపణలు చేశాడన్నారు. చట్ట ప్రకారమే తాము నడుచుకుంటున్నామన్నారు.