సత్తుపల్లి, వెలుగు : సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లిలోని ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నాగబాబు (13) ఆదివారం మధ్యాహ్నం గేదెలు మేపేందుకు తన స్నేహితులైన పులి దేవ (11), షేక్ సైదులుతో కలిసి మెట్టాంజనేయస్వామి ఆలయ సమీపంలోని క్వారీ వద్దకు వెళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత ఈత కొట్టేందుకు ముగ్గురు క్వారీ నీటిలో దూకారు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశారు. అక్కడే గేదెలు మేపుతున్న సుధారాణి అనే మహిళ వీరిని గమనించి క్వారీ వద్దకు వెళ్లి తన చున్నీతో సైదులును బయటకు లాగింది.
నాగబాబు, దేవను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వారిద్దరూ నీటిలో మునిగిపోయారు. విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారితో పాటు పోలీస్, ఫైర్ సిబ్బంది, మత్స్యకారులు క్వారీ వద్దకు చేరుకొని గాలింపు చేపట్టగా.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు దొరికాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
