V6 News

మొరాకోలో కుప్పకూలిన రెండు బిల్డింగులు.. 19 మంది మృతి

మొరాకోలో కుప్పకూలిన రెండు బిల్డింగులు.. 19 మంది మృతి

రబాట్: మొరాకోలోని ఫెజ్‌‎లో మంగళవారం రాత్రి ఘోరం జరిగింది. అల్-మస్తక్బల్ ఏరియాలో  పక్కపక్కనే ఉన్న రెండు నాలుగంతస్తుల బిల్డింగులు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ దుర్ఘటనలో నలుగురు పిల్లలు సహా మొత్తం 19 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 16 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇంకొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారని.. వారిని బయటకు తీయటానికి స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది, సివిల్ ప్రొటెక్షన్ యూనిట్లు రెస్క్యూ ఆపరేషన్  కొనసాగిస్తున్నట్లు వివరించారు. 

 కూలిన ఈ రెండు అడ్జసెంట్ బిల్డింగ్స్ చాలా పాతవని.. వాటిలో మొత్తం ఎనిమిది కుటుంబాలు(40 నుంచి 50 మంది) నివసిస్తున్నాయని తెలిపారు. ఈ భవనాలకు కొన్నేండ్లుగా పగుళ్లు వస్తున్నాయని, అయినా ఎటువంటి మరమ్మతులు చేయించలేదన్నారు. నిర్వహణ లోపమే ప్రమాదానికి ప్రధాన కారణమని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్వహణ లోపంపై ముందే హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం ఇంకా  స్పందించలేదు.