గుండాల  గ్రామంలో నీటి గుంతలో పడి.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం

గుండాల  గ్రామంలో నీటి గుంతలో పడి.. ఇద్దరు చిన్నారులు దుర్మరణం
  • వికారాబాద్  జిల్లా గుండాల  గ్రామంలో విషాదం

పరిగి, వెలుగు: కాళ్లకు అంటిన బురదను కడుక్కుందామని వెళ్లి నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్​ జిల్లా దోమ మండలం గుండాల గ్రామానికి చెందిన గొల్ల మహేశ్(11), కుక్కల శివతేజ(11), గోవర్థన్ స్నేహితులు. గురువారం ఉదయం 9 గంటలకు ముగ్గురు కలిసి పొలానికి వెళ్లారు. దారిలో కాళ్లకు అంటిన బురద కడుక్కుందామని గ్రామానికి చెందిన శ్రీకాంత్​రెడ్డి పొలం వద్ద ఉన్న నీటి గుంత దగ్గర ఆగారు. కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు.

చూస్తుండానే ఇద్దరూ నీట మునిగారు. గట్టుపైన ఉన్న గోవర్ధన్  వెళ్లి మహేశ్, శివతేజ నీటి గుంటలో పడిపోయారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి ఇద్దరూ చనిపోయి ఉన్నారు. వర్షం నీటిని నిల్వ చేసుకునేందుకు తన పొలం దగ్గర ఇటీవల గుంత తవ్వించినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.