ప్రాణాలు తీసిన చెరువు గుంతలు .. ఇద్దరు పిల్లలు కన్నుమూత

ప్రాణాలు తీసిన చెరువు గుంతలు ..  ఇద్దరు పిల్లలు కన్నుమూత

మిర్యాలగూడ, వెలుగు : చెరువు గుంతల్లో మునిగి నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు కన్నుమూశారు. ఇందులో ఇద్దరు పిల్లలుండగా, మరొకరు డిగ్రీ స్టూడెంట్. ఈ చెరువుల్లో మట్టి కోసం జేసీజీలతో పెద్ద పెద్ద గుంతలు తీయగా, ఆ విషయం తెలియని వారు మునిగి ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఇండ్ల నాగరాజు పెద్ద కొడుకైన నాగ ధనుష్(11) వారి బంధువుల కొడుకైన పెద్దిశెట్టి సాత్విక్(8) కొంత మంది పిల్లలతో కలిసి గ్రామ శివారులోని నాగుల్ చెరువుకు ఈతకు వెళ్లారు. చెరువులో అక్రమ తవ్వకాలతో భారీగా గుంతలు ఏర్పడి అందులో వర్షపు నీరు నిలిచింది. ఈ విషయం తెలియని పిల్లలు చెరువులో దిగగా ఆ గుంతల్లో మునిగిపోయారు. పక్కనే ఉన్న స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే ధనుష్​ కన్నుమూశాడు. ఊపిరితో ఉన్న సాత్విక్ ను మిర్యాలగూడలోని ప్రైవేట్​హాస్పిటల్​కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి ఎస్ఐ రవి చెప్పారు. 

జిన్నారంలో డిగ్రీ స్టూడెంట్​..

జిన్నారం : సంగారెడ్డి జిల్లా ఐడీపీఎల్‌ కాలనీలోని బాలానగర్‌కు చెందిన అవుసుల శివకుమార్‌ (20)  డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 20న మెదక్‌లో ఓ పెండ్లికి ఫ్రెండ్స్​తో కలిసి వచ్చాడు. అక్కడి నుంచి ఏడుపాయలలో దర్శనం చేసుకుని అమ్మమ్మ ఊరైన జిన్నారం మండలం లక్ష్మీపతిగూడానికి వెళ్లాడు. అక్కడి నుంచి 21న ఉదయం ఫ్రెండ్స్‌ అక్షయ్, కార్తీక్, గౌతమ్, కిరణ్‌సింగ్‌, యశ్వంత్‌తో కలిసి జిన్నారం మండలంలోని వావిలాల శివారులో ని పీర్ష చెరువులో స్నానానికి వెళ్లాడు. శివకుమార్‌ చెరువులో దిగగా నీట మునిగి గల్లంతయ్యాడు. ఫ్రెండ్స్‌ ఎంత గాలించినా దొరకకపోవడంతో తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. బుధవారం ఉదయం శివకుమార్‌ డెడ్‌బాడీ తేలింది. తన కొడుకు గట్టుపై కూర్చొని ఉండగా జారి చెరువులో పడి చనిపోయాడని మృతుడి తండ్రి గణపతి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయరావు తెలిపారు.