రూరల్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

రూరల్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

హైదరాబాద్, వెలుగు: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా  ఇకపై పంచాయతీ, పరిషత్​ ఎన్నికల్లో పోటీకి అర్హులు కానున్నారు. శనివారం అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టంలోని రెండు సవరణ బిల్లులను మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా.. శాసనసభ ఆమోదించింది. గతంలో పంచాయతీ, పరిషత్​ ఎన్నికల్లో పోటీచేయాలంటే ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన ఉన్నది. 

ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ముందు ఈ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తాజాగా.. దీనికి చట్ట సవరణ చేశారు. దీంతోపాటు వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న  తిరుమలాపూర్‌‌గా మార్చే బిల్లును సభలో ప్రవేశపెట్టి, ఆమోదం పొందారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రనను పాటిస్తున్నాయని, అదే ఉత్తరాది రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాదివాళ్ల రాజకీయ ఆధిపత్యం పెరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యామిలీ ప్లానింగ్‌ను పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో  జనాభా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తున్నామని వెల్లడించారు. జనాభా పెరుగుదల మందగిస్తే వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

భవిష్యత్తులో అవసరం ఉంటే మరోవిధంగా నిబంధనలను పెట్టుకుందామని చెప్పారు. సభలో సభ్యులంతా తమ నిర్ణయాన్ని స్వాగతించారని, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసే అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్టు ఆశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ పేర్కొన్నారు.

ఈ ఆలోచన మంచిదే: ఎమ్మెల్యే కూనంనేని   
రాజకీయ స్వాలంబన దిశగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదేనని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావాల్సినవాళ్లకు ఇది మంచి నిర్ణయమని పేర్కొన్నారు. 

ఇలా చేయడం సరికాదు: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 
రాజకీయ వెసులుబాటు కోసం ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేయొచ్చని నిబంధనను తేవడం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే  వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక్క పిల్లవా డితో సంతృప్తిగానే ఉన్న సందర్భమని, ఒక్కరికి మించి పెంచలేమని, ఖర్చులు భారీగా పెరిగాయని తెలిపారు. అందుకే సాఫ్ట్‌వేర్​ ఇంజినీర్లు కూడా ఒక్కరినే కంటున్నారని చెప్పారు. ఎంత మందినైనా కనొచ్చనేది కరెక్ట్ కాదన్నారు.