ఆడుకుంటుండగా ఇద్దరు పిల్లలు మంటల్లో కాలిపోయిన్రు

ఆడుకుంటుండగా ఇద్దరు పిల్లలు మంటల్లో కాలిపోయిన్రు

నవాబుపేట, వెలుగు: సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అగ్నిప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. ఈ ఘటన మహబూబ్​నగర్ ​జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఇప్పటూరు గ్రామానికి చెందిన మంగళి మాధవులు, సువర్ణ దంపతుల చిన్న కొడుకు విఘ్నేశ్(9), తెలుగు రాములు, స్వాతి దంపతుల పెద్ద కొడుకు ప్రశాంత్(9)​ స్థానిక ప్రైమరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారులు గురువారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని వరికల్లంలో ఉంచిన ట్రాక్టర్​ కేజ్​వీల్​లోకి దిగి ఆడుకుంటున్నారు. పక్కనే ఉన్న వరిగడ్డిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్షణాల్లో కేజ్​వీల్ ​కింద ఉన్న గడ్డి అంటుకుంది. చిన్నారులిద్దరూ ఏడుస్తూ కేజ్​వీల్​ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో వీల్ రంధ్రాల్లో ఇరుక్కున్నారు. గ్రామస్తులు తేరుకుని మంటలార్పి ఇద్దరు చిన్నారులను బయటకు తీసేలోపే శరీరమంతా కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే జిల్లా గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి చనిపోయారు. పోస్ట్​మార్టం అనంతరం శుక్రవారం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్​చెప్పారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం ప్రశాంత్​ పుట్టినరోజు. బర్త్​డేకు ఒక రోజు ముందు చిన్నారి మృతిచెందడం అందరినీ కలచివేసింది.