- పౌర సరఫరా శాఖ విచారణలో బట్టబయలు
హైదరాబాద్, వెలుగు: సివిల్ సప్లై శాఖ ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మేడ్చల్ జిల్లాలో శాఖ పరిధిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్) కేంద్రాల్లో జరిగిన అవినీతిపై నిర్వహించిన ప్రత్యేక విచారణలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటూ వారికి “బలవంతపు పదవీ విరమణ” వేటు వేసింది. కాప్రా ఎంఎల్ఎస్ పాయింట్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ (జనరల్) బి.కల్పన బాయి భారీగా స్టాక్ లోటును కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు విచారణలో తేలింది.
పీడీఎస్ బియ్యం, గోధుమలు, ఐసీడీఎస్ బియ్యం వంటి సరుకుల్లో పెద్ద ఎత్తున లోటు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఒక లారీ పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించడం, అధికారిక రికార్డులను తారుమారు చేయడం వంటి తీవ్రమైన అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా రామంతాపూర్ ఎంఎల్ఎస్ పాయింట్‌లో అసిస్టెంట్ గ్రేడ్-1గా పనిచేస్తున్న ఈ. పాండురంగారావు వద్ద 500.50 క్వింటాళ్ల అదనపు పీడీఎస్ స్టాక్ బయటపడింది. సరుకు రసీదులను దాచిపెట్టడం, రికార్డుల్లో తప్పుగా నమోదు చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఇద్దరు అధికారులు హనుమాన్ రైస్ మిల్‌తో కుమ్మక్కై నకిలీ ఈ-వే బిల్లులు సృష్టించడం, రిజిస్టర్లలో మార్పులు చేయడం, అక్రమంగా లంచాలు తీసుకోవడం, నియంత్రణ ఉత్తర్వులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వంటి ఆరోపణల్లో దోషులుగా తేలారు. ఈ ఘటనపై సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తీవ్రంగా స్పందించారు. సివిల్ సప్లయ్స్ వ్యవస్థలో పారదర్శకతను కాపాడేందుకు అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అన్ని ఎంఎల్ఎస్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెంచనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
