బషీర్‌బాగ్, వెలుగు: అధిక లాభాలు ఇస్తామని ఆశచూపి పలువురి నుంచి డబ్బులు దోచుకున్న భార్యాభర్తలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన వుప్పలపాటి సతీశ్ కుమార్, అతని భార్య శిల్పా బండ కలిసి తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికారు. తొలుత రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి డాక్టర్ పి.వినయ్ కుమార్ (67) సహా పలువురి బాధితులకు చిన్న మొత్తాల్లో లాభాలు చూపి నమ్మించారు.
ఆ తర్వాత పెద్ద మొత్తంలో రూ.23 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. దీంతో సెప్టెంబర్ 18న బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న సీసీఎస్ పోలీసులు.. నిందితులిద్దరిని ఈ నెల 20న కర్నాటకలోని ధార్వాడ్‌లో అరెస్ట్ చేశారు. వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై శనివారం హైదరాబాద్‌కు తరలించారు. ఈ దంపతులపై గతంలోనే సీబీఐ, ఈడీ, జీఎస్టీ కేసులు ఉన్నట్టు గుర్తించారు.
