- ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ప్రమాదం
కూసుమంచి, వెలుగు: రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు లేచి ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం కాగా, క్లీనర్‌ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకలతండా వద్ద మంగళవారం ఉదయం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌లోని నజీర్‌పూర్‌కు చెందిన లారీ డ్రైవర్ శ్రీప్రకాశ్ చౌహాన్ అలియాస్ హీరాసింగ్ (45), క్లీనర్ శ్రీకాంత్ సింగ్‌తో కలిసి బొగ్గు లోడు లారీతో వైజాగ్ నుంచి చంద్రపూర్ వెళ్తున్నారు. అలాగే ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరి గ్రామానికి చెందిన కటారపు జేమ్స్ (57) ఆలుగడ్డల లోడు లారీతో ఆగ్రా నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని మేకలతండా వద్దకు రాగానే రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఓ లారీలో బొగ్గు ఉండడంతో వెంటనే మంటలు చెలరేగి రెండు లారీలకు అంటుకొని పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. క్లీనర్ శ్రీకాంత్ సింగ్ లారీలోంచి దూకి తప్పించుకోగా, హీరాసింగ్, జేమ్స్ లారీల్లోనే ఇరుక్కొని సజీవదహనం అయ్యారు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో.. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలో ప్రమాదం, లారీ డ్రైవర్ మృతి
మల్హర్, వెలుగు : భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు మండలం నాగులమ్మ క్రాస్ వద్ద మంగళవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఓ డ్రైవర్ చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కాటారం నుంచి తాడిచర్లకు వెళ్తున్న బొగ్గు లారీ, మంథని నుంచి కాటారం వెళ్తున్న ఇసుక లారీ కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ క్రాస్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఇసుక లారీ డ్రైవర్, నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన కేతి శ్రీనివాస్ (36) క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు జేసీబీ సాయంతో లారీ క్యాబిన్ నుంచి శ్రీనివార్ డెడ్‌బాడీని బయటకు తీశారు. మరో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
