ఆఫీసర్ల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగారు

ఆఫీసర్ల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగారు
  • పోడు భూముల వ్యవహారంలో తప్పు లేకున్నా సస్పెండ్ చేశారని ఆవేదన
  • అటవీ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఘటన
  • ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం

నిర్మల్, వెలుగు: ఫారెస్ట్​ఆఫీసర్లకు, గిరిజన రైతులకు మధ్య చిచ్చురేపుతున్న పోడు భూముల వ్యవహారం.. ఇప్పుడు అటవీ ఉద్యోగుల ప్రాణాల మీదికి తెస్తోంది. పోడు భూములపై రాష్ట్ర సర్కారు ఆడుతున్న డబుల్​గేమ్‌‌‌‌లో ఉద్యోగులు బలి కావాల్సి వస్తోంది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక అటవీ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి సొంత జిల్లా నిర్మల్‌‌‌‌లో ఇద్దరు అటవీ ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేశారు. మామడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఆరేపల్లి సెక్షన్‌‌‌‌లో కొందరు రైతులు పోడు భూముల్లో పంటల సాగుకు బోరు వేసుకున్నారు. అందుకు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న రాజశేఖర్, ఫారెస్ట్​బీట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న వెన్నెలను బాధ్యులుగా చేస్తూ 3రోజుల కింద సీసీఎఫ్ వినోద్ కుమార్ సస్పెండ్​చేశారు. తమ వర్షన్ చెప్పుకుందామని రాజశేఖర్, వెన్నెల మాజీ డీసీసీబీ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డిని తీసుకొని గురువారం జిల్లా ఫారెస్ట్ ఆఫీస్‌‌‌‌కు వెళ్లారు.

ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిగా వెళ్లిన రామ్​కిషన్​రెడ్డి సీసీఎఫ్‌‌‌‌తో మాట్లాడుతుండగానే వీరిద్దరూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి కింద పడిపోయారు. అక్కడి సిబ్బంది ఇద్దరినీ హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వీరిని ఐసీయూలో చేర్చి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. సాయంత్రానికి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాజశేఖర్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అటవీ శాఖ మంత్రి సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోడు భూముల సమస్యను సర్కారు తేల్చకపోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉన్నతాధికారులు వేధిస్తుండడంతో మధ్యలో తాము మానసిక వేదన అనుభవిస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు.