హైదరాబాద్‌లో ఒకరికి కరోనా

హైదరాబాద్‌లో ఒకరికి కరోనా

దేశంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఒకరికి, తెలంగాణలో మరొకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ మధ్యాహ్నం వెల్లడించింది.

ఇటలీ నుంచి వచ్చిన న్యూఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి, దుబాయ్ నుంచి తెలంగాణ వచ్చిన మరొకరికి కరోనా సోకిందని తెలిపింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందుతోందని పేర్కొంది.

తెలంగాణకు చెందిన కరోనా బాధితుడు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడు సికింద్రాబాద్‌కు చెందిన 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

గతంలో కేరళకు చెందిన ముగ్గురు కరోనా బారిన పడ్డారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి అక్కడి అధికారులు చికిత్స అందించిన తర్వాత పూర్తి కోలుకోవడంతో డిశ్చార్జ్ కూడా చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కేకే శైలజ గతంలో ప్రకటించారు.

మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ చేసి కరోనా లక్షణాలేవీ లేవని తేలాకే బయటకు అనుమతిస్తోంది. ఏ మాత్రం అనుమానం ఉన్నా క్వారంటైన్ (14 రోజుల పాటూ ఐసోలేషన్) చేసి కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చాకనే ఇంటికి పంపుతున్నారు.