రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఎక్కువగా యువతే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల సంభవించే మరణాలను తగ్గించడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కొత్త బైక్ కొనేటప్పుడే రెండు హెల్మెట్లు తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తం ప్రమాదాల్లో వాటివే అధికం..
రాష్ట్రంలోని మొత్తం ప్రమాదాల్లో 53 శాతం బైక్ లకు సంబంధించినవే. వీటిని తగ్గిస్తే మరణాలలో గణనీయమైన మార్పు కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వాహనం నడిపేవారే కాకుండా, వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించేలా చూడాలని , ప్రతి వాహనదారుడికి రెండు హెల్మెట్లు ఉండాలని అధికారులు భావిస్తున్నారు. కాగా రాష్ర్టంలో ప్రతి గంటకూ ఒక రోడ్డు ప్రమాదం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జరిగిన 21 వేల 619 ప్రమాదాల్లో 7 వేల 559 మంది మరణించారు. వీటిలో 10 వేల 653 బైక్ ప్రమాదాల్లో... 3 వేల 977 మరణించారు.
వాహనం నడిపేవారితో పాటు.. వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం అంతంతమాత్రంగానే అమలవుతోంది. అవసరమైతే దీనికి సంబంధించి రోడ్డు రవాణా నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
