హైదరాబాద్ పోచారంలో విషాదం చోటు చేసుకుంది. పోచారం పరిధిలోని చౌదరిగూడకు చెందిన సహజారెడ్డి అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందింది. సహజారెడ్డి అమెరికాలోని న్యూయార్క్ లో ఎంఎస్ చదువుతోంది. శనివారం ( డిసెంబర్ 6 ) బర్మింగ్ హామ్ లోని ఓ అపార్టుమెంటులో జరిగిన అగ్నిప్రమాదంలో సహజారెడ్డి మృతి చెందినట్లు సమాచారం. సహజ తండ్రి ఉడుముల జయకర్ కు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె అయిన సహజ అమెరికాలో ఎంఎస్ చదువుతోంది.
సహజారెడ్డి మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చదువు కోసం అమెరికా వెళ్లిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు సహజారెడ్డి తల్లిదండ్రులు. ఈ ప్రమాదంలో సహజారెడ్డితో పాటు కూకట్ పల్లికి చెందిన మరో విద్యార్ధి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన అపార్టుమెంటులో పదిమంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో విద్యార్థులంతా శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు.. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులను రక్షించారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
