
- కోవిడ్ సమయంలో రూ.22 లక్షలతో కొనుగోలు
- ఇంటిదొంగల పనేనని అనుమానాలు
- ఎంక్వైరీ మొదలుపెట్టిన ఆఫీసర్లు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం సర్కార్ హాస్పిటల్‌లో దొంగలు పడ్డారు. కొవిడ్ సమయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన రెండు వెంటిలేటర్లను ఎత్తుకెళ్లారు. ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ వింగ్‌లో ఉండాల్సిన వెంటిలేటర్లు కనిపించకుండా పోయాయి. ఇది ఇంటి దొంగల పనేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెషీన్లు మాయమైనట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఎంక్వైరీ మొదలు పెట్టారు.
రూ. 22 లక్షలతో కొనుగోలు
కరోనా వ్యాప్తి టైంలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 22 లక్షలు ఖర్చు చేసి రెండు వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. ఈ మెషీన్లను హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ యాపిల్ మెడికల్ సిస్టమ్స్ అనే కంపెనీ సప్లై చేసింది. రూల్ ప్రకారం ఆయా మెషీన్ల సర్వీసింగ్, మెయింటెనెన్స్ కూడా అదే సంస్థ చూసుకుంటుంది. ఈ ఏడాది మే నెలలో సర్వీసింగ్ కోసం వచ్చిన సంస్థ ప్రతినిధులకు రెండు మెషీన్లు కనిపించలేదు. దీంతో హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ గత నెల 19న డీసీహెచ్‌ఎస్, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు బుధవారం బయటపడింది.
ఈ రెండు వెంటిలేటర్లు ఎక్కడికి వెళ్లాయి ? ఎప్పుడు, ఎవరు, ఎలా తరలించారు ? కంపెనీ ప్రతినిధులు వచ్చి గుర్తించే వరకు సిబ్బంది ఏం చేస్తున్నారు ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు కావడానికి ముందు ఈ హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండేది. కాలేజీ మంజూరైన తర్వాత హాస్పిటల్‌ను డీఎంఈ పరిధిలోకి మార్చారు. ఈ మార్పు జరిగిన టైంలోనే రెండు వెంటిలేటర్లు ఇవ్వలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. వెంటిలేటర్ల మాయం వెనుక ఎవరు ఉన్నారని అంతర్గత విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సైతం ?
కరోనా టైంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు అమెరికాకు చెందిన తానా, నాటా వంటి సంస్థల ప్రతినిధులు, దాతలు ఖమ్మం హాస్పిటల్‌కు వందల సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను బహుమతిగా ఇచ్చారు. ఒకే సంస్థ రూ.2 కోట్ల విలువైన 250 మెషీన్లను ఇవ్వగా, వాటిని హాస్పిటల్‌తో పాటు ఇంటి దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న పేషెంట్లకు సైతం ఉపయోగించారు. ఖమ్మం హాస్పిటల్‌లో 500కు పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉండాల్సి ఉండగా.. చాలా వరకు గల్లంతైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నింటిని ఇండ్లలో ఉపయోగించుకునేందుకు తీసుకెళ్లిన పేషెంట్లు తిరిగివ్వలేదని తెలుస్తుండగా, మరికొన్నింటిని జిల్లాలోని పీహెచ్‌సీలకు పంపించామని ఆఫీసర్లు చెబుతున్నారు.
మరికొన్నింటిని కొందరు వ్యక్తులు ప్రైవేట్ క్లినిక్‌లకు తరలించడంతో పాటు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాతల ద్వారా వచ్చిన వాటికి లెక్కా పత్రం లేకపోవడం కొందరికి కలిసివచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.