ఈత రాదంటున్నా..​పూల్ లోకి తోసేశారు ఊపిరాడక యువకుడి మృతి

ఈత రాదంటున్నా..​పూల్ లోకి తోసేశారు ఊపిరాడక యువకుడి మృతి

ఘట్​కేసర్, వెలుగు: బర్త్​​డే పార్టీలో తప్పతాగిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ఈత రాదంటున్నా తోటి ఉద్యోగిని స్విమ్మింగ్​పూల్ లో బలవంతంగా తోసేశారు. గమనించిన మిగతా ఉద్యోగులు బాధితుడిని బయటకు తీయగా, అప్పటికే విగతజీవిగా మారాడు. ఘట్ కేసర్ సీఐ సైదులు వివరాల ప్రకారం.. మాదాపూర్​లోని యష్ టెక్నాలజీ సంస్థ మేనేజర్ బర్త్​డే వేడుకలను ఆదివారం అర్ధరాత్రి మేడ్చల్​జిల్లా ఘట్​ కేసర్ మండలంలోని ఘనపూర్​లో​ వెంకటేశ్ చెందిన​ఫాంహౌస్​లో నిర్వహించారు. 

ఈ వేడుకల్లో సంస్థకు చెందిన దాదాపు 20 మంది పాల్గొనగా, సాయికుమార్, రంజిత్ రెడ్డి ఫుల్​గా మద్యం సేవించి తోటి ఉద్యోగి అజయ్ తేజ(24)కు ఈత రాదని తెలిసి పక్కనే ఉన్న స్విమ్మింగ్​ పూల్​లో బలవంతంగా తోసేశారు. గమనించిన మిగతా ఉద్యోగులు అజయ్ ను బయటకు తీసి జోడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

అజయ్ మేనమామ కిషోర్​ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజిత్​ రెడ్డి, సాయికుమార్​తో పాటు కంపెనీ మేనేజర్ శ్రీకాంత్, ఫాంహౌస్ యజమాని వెంకటేశ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.