బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది : ఎంపీ ఆర్. కృష్ణయ్య 

బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది : ఎంపీ ఆర్. కృష్ణయ్య 
  • సీఎం పదవికంటే బీసీ బిల్లు ముఖ్యం

బషీర్​బాగ్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం కాచిగూడలో జరిగిన సమావేశానికి ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు.  ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్​లో  రెండు సీట్లు బీసీలకు కేటాయిస్తామని కాంగ్రెస్ ఉదయ్​పూర్ డిక్లరేషన్​లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ మాట తప్పిందని విమర్శించారు. బీసీలు ఆర్థికంగా బలంగా ఉన్న స్థానాల్లోనూ ఓసీలకే టికెట్లు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్  నాయకుల ప్రచారంలో  బీసీలు తమ నిరసన గళాన్ని వినిపిస్తామని హెచ్చరించారు.  టికెట్ల కేటాయింపుల ద్వారా కాంగ్రెస్ అగ్రకుల పార్టీగా ముద్ర వేసుకుందని మండిపడ్డారు.

బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం

బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామన్న బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్. కృష్ణయ్యతెలిపారు. అయితే బీసీ ముఖ్యమంత్రి కంటే బీసీ బిల్లు ముఖ్యమని  వెల్లడించారు.  బిల్లు ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో వాటా వస్తుందన్నారు. పార్లమెంట్​లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.  బీసీ ప్రధాని నరేంద్ర మోడీ.. బీసీ బిల్లును ప్రవేశపెట్టకపోతే చరిత్ర క్షమించదని ఆర్. కృష్ణయ్య అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యం, జాతీయ ప్రధాన కార్యదర్శి కొల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.