అయోధ్య టు కాశీ.. రామజ్యోతి

అయోధ్య టు కాశీ.. రామజ్యోతి
  • తీసుకురానున్న ఇద్దరు ముస్లిం మహిళలు
  • అయోధ్యకు వెళ్లిన నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్వీన్

వారణాసి :  అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇద్దరు ముస్లిం మహిళలు అయోధ్య నుంచి కాశీకి రామజ్యోతిని తీసుకురానున్నారు. వారణాసికి చెందిన నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్వీన్ శనివారం అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. వీళ్లిద్దరూ ఆదివారం అయోధ్య నుంచి రామజ్యోతితో కాశీకి బయలుదేరుతారు. అలాగే అయోధ్యలోని మట్టి, సరయు నదీ జలాలనూ తీసుకొస్తారు.  ‘రాముడు.. మన పూర్వీకుడు. ప్రతి భారతీయుడి డీఎన్ఏ ఒక్కటే’ అనే సందేశాన్ని ఇస్తూ.. వీటిని ముస్లిం కమ్యూనిటీ ప్రాంతాల గుండా కాశీకి తీసుకొస్తారు. ఆదివారం వారణాసిలో ముస్లిం కమ్యూనిటీ ప్రజలు రామజ్యోతికి స్వాగతం పలుకుతారని రామ్ పంత్ సంస్థ చీఫ్ రాజీవ్ శ్రీగురూజీ తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న వారణాసి, చుట్టుపక్కల జిల్లాల్లో రామజ్యోతి ఊరేగింపు నిర్వహిస్తామని చెప్పారు.

ఇద్దరూ రామ భక్తులు..

నజ్నీన్, నజ్మా సమాజంలో ఐక్యత, శాంతి కోసం కృషి చేస్తున్నారు. ‘రామ్​ భక్తి’ మూవ్ మెంట్ లో పని చేస్తున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న నజ్నీన్.. హనుమాన్ చాలీసా, రామచరిత మానస్ ను ఉర్దూలోకి అనువాదం చేసింది. ఆమె గురువు పాతాల్ పురి మఠం మహంత్ బాలక్ దాస్. రామ్ పంత్ సంస్థలో నజ్నీన్ పని చేస్తోంది. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రాముడు.. మన పూర్వీకుడు. ఒక వ్యక్తి తన మతం మార్చుకోవచ్చు.. కానీ తన పూర్వీకులను మార్చుకోలేడు. ముస్లింలకు మక్కా ఎలాగో.. హిందువులకు అయోధ్య అలా” అని ఆమె పేర్కొంది. ఇక నజ్మా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రధాని మోదీపై పీహెచ్ డీ పూర్తి చేసింది. వారణాసికి చెందిన హిందూ–ముస్లిం డైలాగ్ సెంటర్ ద్వారా హిందూముస్లింల ఐక్యత కోసం పని చేస్తోంది. కాగా నజ్నీన్, నజ్మా ఇద్దరూ ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీళ్లిద్దరూ ప్రతిఏటా రామనవమి, దీపావళికి వందలాది మంది ముస్లిం మహిళలతో కలిసి శ్రీరామ హారతి నిర్వహిస్తున్నారు.