మైనారిటీలకు రెండు కొత్త స్కీములు

మైనారిటీలకు రెండు కొత్త స్కీములు
  • ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద ఆర్థిక సాయం
  • వితంతువులు, ఒంటరి మహిళలకు వ్యాపారం కోసం రూ.50 వేలు
  • రేవంత్ అన్న కా సహారా పేరుతో ఫకీర్లకు రూ. లక్ష, మోపెడ్ లు    
  • 35 వేల అప్లికేషన్లు దాఖలు.. ముగిసిన గడువు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలు సొంతంగా ఎదిగేందుకు ప్రభుత్వం కొత్త స్కీమ్ లు తీసుకొచ్చింది. “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన”, “రేవంత్ అన్న కా సహారా’’ పేరుతో రెండు స్కీమ్ లను స్టార్ట్ చేసి గైడ్ లైన్స్ ఖరారు చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద అర్హులైన పేద ముస్లిం, మైనారిటీలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు.

 ఇప్పటికే ఇందిరా మహిళాశక్తిలో భాగంగా 30 వేల మందికి  కుట్టు మిషన్లు అందచేయగా, ఇపుడు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేసే స్కీమ్ ను ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈ రెండు కొత్త స్కీమ్ ల అమలు కోసం రూ. 35 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన వితంతువులు లేదా ఒంటరి మహిళలు సరైన ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతుంటారు. 

వారు గౌరవప్రదంగా జీవించడానికి, సొంతంగా చిన్న వ్యాపారం (సెల్ఫ్ ఎంప్లాయిమెంట్) పెట్టుకోవడానికి ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుంది. ఈ గడువు శనివారం నాటితో ముగియగా 35 వేల అప్లికేషన్లు వచ్చినట్టు మైనారిటీ శాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి అప్లికేషన్లను జిల్లా అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 

ఇవీ గైడ్ లైన్స్..  

ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, బౌద్ధ లేదా పార్సీ మైనారిటీ వర్గాలకు చెందిన.. వితంతువు, విడాకులు తీసుకున్న వారు, అనాథ లేదా 30 ఏళ్లు దాటిన అవివాహిత మహిళలు ఈ స్కీమ్ లకు అర్హులు అని జీఓలో ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉండాలని పేర్కొంది. కుట్టు మిషన్ల యూనిట్, చిన్న కిరాణా కొట్టు లేదా ఫ్యాన్సీ స్టోర్, బ్యూటీ పార్లర్, హస్తకళలు, గృహ పరిశ్రమలు (అప్పడాలు, పచ్చళ్ల తయారీ వంటివి) ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 అప్లికేషన్ చేసుకోవటానికి ఆధార్, రేషన్ కార్డ్‌, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్, భర్త డెత్ సర్టిఫికెట్   లేదా విడాకుల పత్రాలు జత చేసి.. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాష్ర్ట వ్యాప్తంగా వచ్చిన అప్లికేషన్లను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా, మండల అధికారులు పరిశీలించి, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయనున్నారు.​ అర్హులైన వారిని ఎంపిక చేసి, ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నగదును జమ చేయనుంది. 

ఫకీర్ వ్యవస్థకు మంగళం

అట్టడుగు మైనారిటీ వర్గాల జీవనోపాధిని మెరుగుపరచడానికి రేవంత్ అన్న కా సహారా స్కీమ్ ను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఫకీర్, దూదేకులవర్గాల వారిని ఆదుకునేందుకు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. దీనికింద  లబ్ధిదారులకు రూ. లక్ష గ్రాంటుతో పాటు రవాణా, వ్యాపార అవసరాల కోసం మోపెడ్‌లు పంపిణీ చేస్తారు.

 గ్రామాల్లో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తున్న పేద మైనారిటీలైన ఫకీర్లను సైతం ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫకీర్లకు సుమారు రూ. లక్ష విలువ చేసే మోపెడ్ లు ఇచ్చి వాటిపై తిరుగుతూ చిన్న వ్యాపారం చేసేలా ఆర్థిక సాయం చేయనున్నారు. వీటికి రాష్ర్టవ్యాప్తంగా 2. 40 లక్షల అప్లికేషన్లు రాగా తొలి దశలో ప్రతి ని 

మైనారిటీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం 

మైనారిటీల అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తోంది.  మైనారిటీలు సొంతంగా ఎదగటానికి ప్రభుత్వం కొత్త స్కీమ్ లు తీసుకొచ్చింది. దశల వారీగా వీరు సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు కార్పొరేషన్ల నుంచి ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇందిరా మహిళ శక్తిలో ఇప్పటికే కుట్టు మిషన్లు అందచేస్తుండగా, తాజాగా చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. 

లబ్ధిదారులను జిల్లా కలెక్టర్లు ఎంపిక చేస్తారు. గ్రామాల్లో ఫకీర్ల వ్యవస్థను పూర్తిగా బంద్ చేయటానికి వారికి మోపెడ్ తో పాటు చిన్న డబ్బాలు అందిస్తాం. వచ్చే 3 ఏళ్లలో అర్హులైన మైనారిటీలందరికీ ఈ స్కీమ్ లు వర్తింపచేస్తాం. -ఓబేదుల్లా కొత్వాల్, స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్