ఒకే వ్యక్తికి రెండు పేర్లతో రెండు పాస్ బుక్కులు

ఒకే వ్యక్తికి రెండు పేర్లతో రెండు పాస్ బుక్కులు
  • ఒకే ఫొటో, ఒకే ఆధార్ నెంబర్​తో జారీ చేసినా రిజెక్ట్ చేయని సాఫ్ట్ వేర్ 
  • రైతు బంధుకు లింక్ చేసిన టైమ్ లోనైనా గుర్తించని అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోని డొల్లతనం మరోసారి బయటపడింది. ఈ పోర్టల్ తో పకడ్బందీగా భూరికార్డులను నిర్వహిస్తున్నామని సర్కార్​చెబుతున్నప్పటికీ.. డేటా ఎంట్రీలో తరచూ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఒకే వ్యక్తికి రెండు పేర్లతో రెండు వేర్వేరు పాస్ బుక్స్ జారీ కావడం, వేర్వేరు ఖాతాలకు ఒకే ఆధార్ నెంబర్​లింక్ కావడం.. ధరణి సాఫ్ట్ వేర్ లోని లోపాలకు అద్దం పడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాలకు చెందిన మహ్మద్ తాజోద్దీన్ కు అదే గ్రామంలోని 124/2 సర్వే నంబర్ లో 3.0700 ఎకరాల భూమి ఉంది. తాజోద్దీన్ ఆధార్ నెంబర్, బయోమెట్రిక్, ఫొటో ఎంట్రీ చేసి ఆయనకు 2019 ఫిబ్రవరి 14న రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ బుక్ జారీ చేశారు. అయితే ఈయనకే ఇదే మండలంలోని కోనంపేట్ గ్రామంలోని 51వ సర్వే నెంబర్ లో ఉన్న 5.38 ఎకరాల భూమికి మరో పాస్​బుక్ జారీ చేశారు. కాకపోతే ఇక్కడ పట్టాదారు పేరు మహ్మద్ తాజోద్దీన్ బదులు మహ్మద్ సిరాజోద్దీన్​గా పేర్కొన్నారు. కానీ రెండు పాస్ బుక్స్​ లోనూ ఫొటోతో పాటు ఆధార్ నెంబర్ ఒక్కటే ఉంది. ఇలా ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు పేర్లతో పాస్ బుక్స్ జారీ కావడం, బయోమెట్రిక్,​ ఆధార్​లింక్ చేసిన సమయంలోనూ మిస్​ మ్యాచింగ్ ను సాఫ్ట్ వేర్ రిజెక్ట్ చేయకపోవడం, అధికారులైనా గుర్తించకపోవడం గమనార్హం. అంతేగాక పాస్ బుక్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్​ అకౌంట్ నెంబర్లను రైతు  బంధుకు లింక్​ చేసిన సమయంలోనూ పేర్లు మిస్ మ్యాచ్ కావడాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించలేకయారు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా తాజోద్దీన్ కు ఇప్పటికే రూ.1.96 లక్షల వరకు రైతు బంధు జమైంది. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండేను సంప్రదించగా.. ఇప్పటి వరకు ఆ విషయం తన దృష్టికి రాలేదని, రికార్డులు ఒకసారి చెక్​ చేస్తానని చెప్పారు.