శివ్వంపేట, వెలుగు: వేర్వేరు జిల్లాల్లో బుధవారం ఇద్దరు హత్యకు గురయ్యారు. మెదక్ జిల్లాలో ట్రాక్టర్ డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా, పెద్దపల్లి జిల్లాలో ఓ మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన అన్వర్ (51) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఆర్మూర్ జిల్లా బాల్కొండలో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకురావాలని అంకుషాపూర్ గ్రామానికే చెందిన జంగారెడ్డి చెప్పడంతో అన్వర్ మంగళవారం బాల్కొండ వెళ్లాడు. ట్రాక్టర్‌ను తీసుకొని వచ్చే క్రమంలో తన భార్య భార్య ఫర్జానాకు ఫోన్ చేసి తూప్రాన్ వరకు వచ్చానని, ఇంటికి వచ్చేందుకు లేట్ అవుతుందని చెప్పాడు. రాత్రి 12 అయినా అన్వర్ ఇంటికి రాకపోవడంతో ఫర్జానా భర్తకు ఫోన్ చేయగా.. స్విచాఫ్ అని వచ్చింది.
దీంతో బుధవారం ఉదయం తూప్రాన్ వచ్చి వెతుకుతుండగా.. శభాష్‌పల్లి వద్ద ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూడగా.. అన్వర్ తీవ్ర గాయాలతో చనిపోయి కనిపించాడు. కాగా, అన్వర్‌కు భోజ్యతండా పంచాయతీ పరిధిలోని జెగ్యా తండాకు చెందిన కోల లలిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఇటీవల మహిళను అంకుషాపూర్ గ్రామానికి తీసుకురాగా.. తాము నచ్చజెప్పి పంపించేశామని అన్వర్ భార్య ఫర్జానా తెలిపింది. ఈ క్రమంలోనే అన్వర్ హత్యకు గురికావడంతో లలిత బంధువులే హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫర్జానా ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరాజుగౌడ్ తెలిపారు.
పుట్నూర్‌లో గొంతుకోసి మహిళ హత్య
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసం హత్య చేశారు. గ్రామానికి చెందిన బౌతు సుమలత (36) మేకలు కాస్తూ జీవిస్తోంది. సుమలతకు పెండ్లి కాకపోవడంతో పక్షవాతంతో మంచానికే పరిమితమైన తండ్రి లింగయ్యతో కలిసి ఉంటోంది. జనగణన కోసం ఎన్యుమరేటర్ బుధవారం సుమలత ఇంటికి రాగా.. ఆమె చనిపోయి కనిపించింది.
వెంటనే స్థానికులకు, పోలీసులకు విషయం చెప్పడంతో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, పెద్దపల్లి ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, సుమలతను అదే గ్రామానికి చెందిన వేల్పుల స్వామి అనే వ్యక్తి పెండ్లు చేసుకుంటానని కొంత కాలంగా వేధిస్తున్నాడని, హత్యలో అతడి ప్రమేయం ఉండొచ్చని మృతురాలి అన్న శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బసంత్‌నగర్ ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
