పొలంలో కూలిన శిక్షణ విమానం..ఇద్దరు ట్రైనీ పైలట్ల దుర్మరణం

పొలంలో కూలిన శిక్షణ విమానం..ఇద్దరు ట్రైనీ పైలట్ల దుర్మరణం

పొలంలో శిక్షణ విమానం కూలి ఇద్దరు ట్రైనీ పైలట్లు చనిపోయారు. వికారాబాద్​ జిల్లాలోని బంట్వారం మండలం సుల్తాన్​పూర్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం ట్రైనీ పైలట్​ అమన్​ ప్రీత్​ కౌర్​(21), సేఫ్టీ పైలట్​ ప్రకాశ్​ విశాల్​(23) బేగంపేట నుంచి గుల్బర్గాకు బయల్దేరారు. బంట్వారం సమీపంలోకి రాగానే ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో విమానం కుదుపులకు గురైంది. ఆ వెంటనే ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​తో సంబంధాలు తెగిపోయాయి. పైలట్లు విమానాన్ని సమీపంలోని పత్తి పొలంలో దింపేందుకూ ప్రయత్నం చేశారు. అయినా, అదీ జరగలేదు. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పొలంలోని రైతులు పైలట్ల మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఎస్పీ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణం వాతావరణమా లేదా సాంకేతిక లోపమా అన్నదానిపై ఏవియేషన్​ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమన్​ప్రీత్​ కౌర్​ స్వస్థలం పంజాబ్​లోని ఖరార్​ కాగా, ప్రకాశ్​ది ఢిల్లీ.